'వకీల్ సాబ్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైన్ లో పెట్టిన ప్రాజెక్ట్స్ లో సురేందర్ రెడ్డి మూవీ కూడా ఉన్న సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ ఏళ్లు గడుస్తున్నా ఈ సినిమా పట్టలెక్కలేదు.. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అయితే ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టబోతున్నారని తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 2020 సెప్టెంబర్ 2న సురేందర్ రెడ్డితో సినిమాని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. పవన్ సన్నిహితుడైన రామ్ తాళ్లూరి ఈ చిత్రానికి నిర్మాత. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.9 గా రూపొందనుందని ప్రకటించారు. డైరక్టర్ సూరితో కలిసి ఎన్నో హిట్ చిత్రాలకు వర్క్ చేసిన దర్శక రచయిత వక్కంతం వంశీ కథ అందించనున్నట్లు పోస్టర్ లో పేర్కొన్నారు. అయితే మూడేళ్ల తర్వాత తాజాగా ఈ సినిమా పనులు మొదలయ్యాయి.
SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో పవన్ కళ్యాన్ తదుపరి సినిమా యొక్క ఆఫీస్ ఓపెనింగ్ పూజ ఈ రోజు శుక్రవారం జరిగింది. దీనికి దర్శక నిర్మాతల సురేందర్ రెడ్డి, రామ్ తాళ్లూరితో పాటుగా రైటర్ వక్కంతం వంశీ కూడా హాజరయ్యారు. భారీ స్థాయిలో ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించడానికి మేకర్స్ రెడీ అయ్యారని తెలుస్తోంది. రేపు పవన్ బర్త్ డే స్పెషల్ గా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్డేట్ ఏదైనా వచ్చే అవకాశం వుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
నిజానికి పవన్ కల్యాణ్ - సురేందర్ కాంబోలో మూవీ ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్లాల్సింది. అఖిల్ అక్కినేనితో దర్శకుడు తెరకెక్కించిన 'ఏజెంట్' మూవీ డిలే అవ్వడం.. పవర్ స్టార్ సినిమాల ప్రాధాన్యత క్రమం మారడంతో అసలు ఈ ప్రాజెక్ట్ ఊసే లేకుండా పోయింది. కేవలం పవన్ పుట్టినరోజులకు మాత్రమే ఒక పోస్టర్ రిలీజ్ చేసి, ఈ సినిమా ఒకటి వుందని గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆ విధంగా 2021 బర్త్ డేకి వచ్చిన పోస్టర్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది.
''యథా కాలమ్.. తథా వ్యవహారమ్'' అంటూ సంస్కృత పదాలతో డిజైన్ చేసిన స్పెషల్ పోస్టర్ లో ఓవైపు గన్ కల్చర్ మరోవైపు హైదరాబాద్ నగరాన్ని చూపించారు. సమకాలనీ అంశాలకు విభిన్నమైన యాక్షన్ కథను జోడించి ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు హింట్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో, ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేశారని అందరూ ఫిక్స్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్టుండి ఆఫీస్ ఓపెన్ చేసి, ఈ సినిమా ఇంకా సజీవంగా ఉందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు.
పవన్ - సూరి కాంబినేషన్ ను అనౌన్స్ చేసినప్పుడు ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. స్టైలిష్ ఫిలిం మేకర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి.. పవన్ కళ్యాణ్ ను ఎలా ప్రెజెంట్ చేస్తారో చూడాలనే ఎగ్జైట్ మెంట్ ను వ్యక్త పరిచారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎందుకంటే దర్శకుడి చివరి సినిమా 'ఏజెంట్' బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్ గా మారింది. ఈసారిఏ హీరో ఛాన్స్ ఇస్తాడని అనుకుంటున్న సమయంలో పవన్ తో సినిమా పనులు షురూ చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ తో ఎలాంటి సినిమా చేయబోతున్నారు? పవన్ నుంచీ గ్రీన్ సిగ్నల్ వచ్చిందా? ఇది గతంలో ఎనౌన్స్ చేసిన 'యథా కాలమ్.. తథా వ్యవహారమ్' లైన్ లోనే ఉంటుందా? లేదా ఏదైనా రీమేక్ కథను చేస్తున్నారా? ఇలాంటి విషయాలేవీ ప్రస్తుతానికి బయటకి రాలేదు. అందులోనూ పవన్ ఇప్పటికే కమిటైన OG, 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హర వీరమల్లు' సినిమాలు కంప్లీట్ చెయ్యాల్సి ఉంది. ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి. అందుకే సూరి ప్రాజెక్ట్స్ ను ఎప్పుడు సెట్స్ మీదకి తీసుకెళ్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
Also Read: ‘ఖుషి’ సినిమాకి, సమంత రియల్ లైఫ్‌కు పోలికలు ఉన్నాయా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial