Krishna Janmashtami 2023 Date: పండుగలన్నీ తిథుల ఆధారంగా నిర్ణయిస్తారు. ఏ రోజు సూర్యోదయానికి తిథి ఉంటే ఆ రోజునే పరిగణలోకి తీసుకుంటారు. కానీ కృష్ణాష్టమి విషయంలో గందరగోళం రావడానికి కారణం తిథులు తగులు,మిగులు రావడమే. పంచాంగకర్తలు ఏ రోజైతే కృష్ణాష్టమి జరుపుకోవాలని సూచిస్తున్నారో ఆ రోజు సూర్యోదయానికి అష్టమి తిథి లేదు. మర్నాడు అష్టమి తిథి ఉంది. దీంతో కృష్టాష్టమి ఏ రోజు జరుపుకోవాలా అనే గందరగోళం నెలకొంది. ఇంతకీ
కృష్ణాష్టమి 6వ తేదీనా? లేక 7వ తేదీన జరుపుకోవాలా? అంటే ముందుగా తిథులు గురించి చూసుకోవాలి...
Also Read: సెప్టెంబరు నెల ఈ రాశులవారికి అదృష్టాన్నిస్తుంది, ఆర్థికంగా కలిసొస్తుంది
అష్టమి ఘడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు
- సెప్టెంబరు 6 సప్తమి బుధవారం రాత్రి 7 గంటల 58 నిముషాల వరకూ ఉంది.. ఆ తర్వాత అష్టమి ఘడియలు మొదలయ్యాయి.
- సెప్టెంబరు 7 అష్టమి గురువారం రాత్రి 7 గంటల 47 నిముషాల వరకూ ఉంది.
కన్నయ్య జన్మనక్షత్రం రోహిణి
సెప్టెంబరు 6 బుధవారం మధ్యాహ్నం 2 గంటల 42 నిముషాల వరకూ కృత్తిక నక్షత్రం ఉంది..ఆ తర్వాత ప్రారంభమైన రోహిణి నక్షత్రం సెప్టెంబరు 7 గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకూ ఉంది.
Also Read: లోకంలో మనుషులంతా ఇలాగే ఉంటారు, అర్థం చేసుకోరూ!
కృష్ణాష్టమి ఎప్పుడు
సాధారణంగా పుట్టిన రోజులన్నీ కూడా సూర్యోదయానికి తిథి ఉండేలా చూసుకుంటారు. నక్షత్రం ఒక్కరోజు అటు ఇటు ఉన్నాకానీ తిథి ముఖ్యం. అయితే పంచాంగకర్తలంతా సెప్టెంబరు 6నే కృష్ణాష్టమి జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే శ్రీ కృష్ణుడు జన్మించింది శ్రావణమాసం బహుళ అష్టమి అర్థరాత్రి సమయంలో. అక్కడి నుంచి వసుదేవుడి ద్వారా గోకులంలో నందుడి ఇంటికి చేరుకున్నది మర్నాడు ఉదయం. అందుకే శ్రీ కృష్ణుడు జన్మించిన సమయానికి అష్టమి తిథి ఉండడం ప్రధానం అంటారు. అయితే వైష్ణవులు మాత్రం సెప్టెంబరు 7నే కృష్ణాష్టమి జరుపుకుంటారు. ఎందుకంటే వారికి రోహిణి నక్షత్రంలో కూడిన అష్టమి ప్రధానం. మిగిలినవారికి కృష్ణాష్టమి సెప్టెంబరు 6 బుధవారమే.
కృష్ణుడు జన్మించిన శ్రావణ బహుళ అష్టమిని కృష్ణాష్టమి పర్వదినంగా జరుపుకుంటారు. కన్నయ్య చిన్నప్పుడు గోకులంలో పెరగడం వల్ల గోకులాష్టమి అని కూడా అంటారు. కృష్ణాష్టమి రోజున ఒకపూట భోజనం చేసి శ్రీకృష్ణునికి పూజ చేసి కృష్ణుడి ఆలయాలు దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్య ఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయాల్లో అష్టోత్తర పూజ, సహస్ర నామా పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరతాయి. ఈ రోజున కృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంధ పురాణం చెబుతుంది. సంతానం లేని వారు, వివాహం కావాల్సిన వారు ఈ పుణ్యదినాన బాల కృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుందని పండితులు చెబుతారు. కృష్ణాష్టమి రోజు భాగవతం, భగవద్గీత పఠించాలి. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి, కొందరు రోజంతా ఉపవాసం ఉండి అర్థరాత్రి కృష్ణుడు జన్మించిన సమయంలో ప్రత్యేక పూజలు చేసి మర్నాడు వైష్ణవ ఆలయాలకు వెళ్లి ఉపవాసం విరమిస్తారు.
Disclaimer:ఇక్కడ అందించిన సమాచారం పండితుల నుంచి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.