Kidney Donation: సోదర సోదరీ భావానికి, ప్రేమకు, అనుబంధానికి నిదర్శనం రాఖీ పండుగ. కష్ట సమయంలో తోడుగా ఉంటారని, ఇబ్బందులు ఎదురైనప్పుడు మద్దతు ఇస్తారని నమ్ముతారు. సుఖదుఃఖాల్లోనూ అండగా నిల్చుంటారు అందుకు ప్రతీకగా రాఖీ కడతారు. అలాంటి రక్షా బంధన్ వేళ సోదర-సోదరీ భావానికి ప్రతీకగా, ఉదారహణగా నిలిచింది ఆ వ్యక్తి చేసిన పని. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన సోదరిని కాపాడుకునేందుకు ఆ వ్యక్తి చేసిన పని ఇప్పుడు ఎంతో మంది ప్రశంసలు అందుకుంటోంది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సోదరికి కిడ్నీ దానం చేసి రక్షా బంధన్‌కు నిజమైన అర్థాన్ని చెప్పాడు. పూణెకు చెందిన దుష్యంత్ వర్కర్ అనే వ్యక్తి.. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తన సోదరి శీతల్ భండారీకి కిడ్నీ దానం చేశాడు. అలా తనకు పునర్జన్మ ప్రసాదించాడు.
చాలా పరీక్షల తర్వాత వెలుగులోకి కిడ్నీ సమస్యలు
శీతల్ భండారి కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. అయితే తొలి దశలో సమస్య బయట పడలేదు. చాలా పరీక్షల తర్వాత ఆమెకు కిడ్నీ సమస్య ఉన్నట్లు తేలింది. పూణెలో ఉంటూ రెండేళ్లుగా చికిత్స పొందారు. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. హైదరాబాద్ లోని ఆస్పత్రికి వెళ్లాలని తన సోదరి సూచించడంతో ఆమె నగరానికి వచ్చారు. వారు పరీక్షించిన తర్వాత శీతల్ కు డయాలసిస్ అవసరమని సూచించారు. అయితే తరచూ డయాలసిస్ చేయించుకోవడం చాలా కష్టతరంగా ఉండటంతో కిడ్నీ మార్పిడి చేయించుకోవాలని భావించారు. కిడ్నీ దాత కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. చూస్తుండగానే 4, 5 ఏళ్లు గడిచిపోయాయి. ఇంతలో శీతల్ భండారీ సోదరుడు దుష్యంత్ వర్కర్ తన కిడ్నీని దానం చేసేందుకు ముందుకు వచ్చాడు. సోదరి పడుతున్న బాధను చూసి తట్టుకోలేకపోయాడు. తన కిడ్నీ ఇచ్చి తన బాధను, కష్టాన్ని దూరం చేయాలనుకున్నాడు. వైద్యులు పరీక్షలు చేసి దుష్యంత్ కిడ్నీ శీతల్ భండారికి సరిగ్గా సరిపోతుందని తేల్చారు. ఇటీవలె వారికి ఆపరేషన్ నిర్వహించి కిడ్నీ మార్పిడిని విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం వారిద్దరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. సోదరి అంటే తనకెంతో ఇష్టమని, ఆమె బాధపడుతుండటాన్ని చూసి తట్టుకోలేక పోయానని దుష్యంత్ చెప్పుకొచ్చారు. అందుకే తన కిడ్నీ ఇచ్చినట్లు చెప్పారు.
Read Also: Raipur Woman: రక్షా బంధన్ వేళ సోదరుడికి ఆత్మీయ కానుక, ప్రాణాన్ని కాపాడేందుకు కిడ్నీ దానం
ఛత్తీస్‌గఢ్ లోనూ ఇలాంటి ఘటనే..!
ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్ కు చెందిన ఓం ప్రకాష్ ధంగర్ అనే 48 ఏళ్ల వ్యక్తి గత సంవత్సరం కాలంగా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి మూలంగా అతడి మూత్ర పిండాలు రోజురోజుకూ క్షీణించడం ప్రారంభించాయి. ఒక దశకు వచ్చే సరికి అతడికి కిడ్నీ డయాలసిస్ చేయడం తప్పనిసరిగా మారింది. ఓం ప్రకాష్ ధంగర్ ఒక కిడ్నీ 80 శాతం, మరో కిడ్నీ 90 శాతం దెబ్బతిన్నాయి. డయాలసిస్ చేసుకోవడంతో అనేక ఇబ్బందులు వచ్చాయి. వాటి బాధ తొలగిపోవాలంటే.. కిడ్నీ మార్పిడి చేయాల్సిందేనని వైద్యులు తేల్చి చెప్పారు. మూత్రపిండాల మార్పిడి చేయించేందుకు అతడి కుటుంబం సిద్ధమైంది. గుజరాత్ నాడియాడ్ లోని ఆస్పత్రిలో అతనికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
కిడ్నీ మార్పిడి చేసేందుకు కిడ్నీలను దానం చేసే వారు అవసరమని వైద్యులు ఓం ప్రకాష్ ధంగర్ కుటుంబ సభ్యులకు చెప్పారు. ఎవరైనా దాతలు ఉంటే ఆపరేషన్ కు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ విషయం రాయ్‌పూర్ లోని తిక్రపారా నివాసి అయిన ఓం ప్రకాష్ ధంగర్ అక్క షీలాబాయి పాల్ దృష్టికి వచ్చింది. వెంటనే ఆమె తన సోదరుడికి కిడ్నీ దానం ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అనంతరం వైద్యులు ఆమెకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత షీలాబాయి పాల్ కిడ్నీ.. ఓం ప్రకాష్ ధంగర్ కు సరిగ్గా సరిపోతుందని నిర్ధారించారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 3వ తేదీన కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరగబోతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం షీలాబాయి పాల్, ఓం ప్రకాష్ ధంగర్ గుజరాత్ లోని ఆస్పత్రిలో ఉన్నారు. రక్షా బంధన్ సందర్భంగా షీలాబాయి సోదరుడికి రాఖీ కట్టారు. తాను నిండునూరేళ్లు జీవించాలని ఆమె దీవించారు. తమ్ముడు ఓం ప్రకాష్ అంటే తనకు ఎంతో ఇష్టమని, అందుకే అతడికి కిడ్నీదానం చేసేందుకు ముందుకు వచ్చినట్లు చెప్పారు.