Raipur Woman: సోదరుల విజయాన్ని కాంక్షిస్తూ, వారు జీవితాంతం ఆనందంగా ఉండాలని కోరుతూ రాఖీ కడతారు సోదరీమణులు. తోడబుట్టిన వారికి జీవితాంతం అండగా ఉంటానని సోదరులు హామీ ఇచ్చే రోజు ఇది. నువ్వు ఆనందంగా ఉంటూ విజయాలను సాధిస్తూ.. తనకూ రక్షణ కల్పించాలని కోరుతూ ప్రతి అక్క, చెల్లి తమ సోదరులకు రాఖీలు కడతారు. అలా రాఖీ కట్టిన వారికి సోదరులు తమ సామర్థ్యం మేరకు బహుమతులు, నగదు ఇస్తుంటారు. అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెల్లు ఒకరికి ఒకరు ఎప్పుడూ తోడూ నీడగా ఉంటారు. సరదాగా కొట్టుకున్నా, తిట్టుకున్నా.. ఆపద సమయంలో, అవసరమైన సందర్భంలో అండగా నిల్చుంటారు. ఇందుకు నిదర్శనంగా, ఓ ఉదాహరణగా నిలిచారు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ కు చెందిన మహిళ. రక్షా బంధన్ కు సోదరుడి నుంచి కానుకలు తీసుకోవాల్సిన తను.. తానే సోదరుడికి ఓ కానుక ఇచ్చారు. ఆమె ఇచ్చిన ఆ కానుక ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. రక్షా బంధన్ వేళ నిజమైన ఆత్మీయ అనురాగాలు అంటే ఏంటో తెలియజెప్పింది. కిడ్నీల వైఫల్యంతో బాధపడుతున్న సోదరుడికి తన కిడ్నీని ఇచ్చేందుకు సిద్ధమైంది. రక్షా బంధన్ కానుకగా అన్నట్లుగా.. రాఖీ కట్టి మరీ తన బహుమతి ఇదీ అంటూ చెప్పడంతో ఇప్పుడు ఆమె అందరి ప్రశంసలను పొందుతోంది.


ఛత్తీస్‌గఢ్‌ లోని రాయ్‌పూర్‌ కు చెందిన ఓం ప్రకాష్ ధంగర్ అనే 48 ఏళ్ల వ్యక్తి గత సంవత్సరం కాలంగా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి మూలంగా అతడి మూత్ర పిండాలు రోజురోజుకూ క్షీణించడం ప్రారంభించాయి. ఒక దశకు వచ్చే సరికి అతడికి కిడ్నీ డయాలసిస్ చేయడం తప్పనిసరిగా మారింది. ఓం ప్రకాష్ ధంగర్ ఒక కిడ్నీ 80 శాతం, మరో కిడ్నీ 90 శాతం దెబ్బతిన్నాయి. డయాలసిస్ చేసుకోవడంతో అనేక ఇబ్బందులు వచ్చాయి. వాటి బాధ తొలగిపోవాలంటే.. కిడ్నీ మార్పిడి చేయాల్సిందేనని వైద్యులు తేల్చి చెప్పారు. మూత్రపిండాల మార్పిడి చేయించేందుకు అతడి కుటుంబం సిద్ధమైంది. గుజరాత్ నాడియాడ్ లోని ఆస్పత్రిలో అతనికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.


కిడ్నీ మార్పిడి చేసేందుకు కిడ్నీలను దానం చేసే వారు అవసరమని వైద్యులు ఓం ప్రకాష్ ధంగర్ కుటుంబ సభ్యులకు చెప్పారు. ఎవరైనా దాతలు ఉంటే ఆపరేషన్ కు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ విషయం రాయ్‌పూర్‌ లోని తిక్రపారా నివాసి అయిన ఓం ప్రకాష్ ధంగర్ అక్క షీలాబాయి పాల్ దృష్టికి వచ్చింది. వెంటనే ఆమె తన సోదరుడికి కిడ్నీ దానం ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అనంతరం వైద్యులు ఆమెకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత షీలాబాయి పాల్ కిడ్నీ.. ఓం ప్రకాష్ ధంగర్ కు సరిగ్గా సరిపోతుందని నిర్ధారించారు.


Also Read: INDIA Alliance Meeting: ముంబయి వేదికగా ప్రతిపక్ష కూటమి సమావేశం, 27 పార్టీలు హాజరు


ఈ క్రమంలో సెప్టెంబర్ 3వ తేదీన కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరగబోతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం షీలాబాయి పాల్, ఓం ప్రకాష్ ధంగర్ గుజరాత్ లోని ఆస్పత్రిలో ఉన్నారు. రక్షా బంధన్ సందర్భంగా షీలాబాయి సోదరుడికి రాఖీ కట్టారు. తాను నిండునూరేళ్లు జీవించాలని ఆమె దీవించారు. తమ్ముడు ఓం ప్రకాష్ అంటే తనకు ఎంతో ఇష్టమని, అందుకే అతడికి కిడ్నీదానం చేసేందుకు ముందుకు వచ్చినట్లు చెప్పారు.