Gruha Laxmi Scheme: 


రూ.2 వేల ఆర్థిక సాయం..


కర్ణాటక కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీల్లో ఒకటైనా Gruha Laxmi scheme ని ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లోని మహిళలకు నెలకు రూ.2 వేల ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుతున్నామని వెల్లడించారు. ఆగస్టు 27 నాటికి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి 100 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటికే నాలుగు స్కీమ్స్‌ని ప్రారంభించిన ప్రభుత్వం...ఇప్పుడు నాలుగో పథకమైన గృహ లక్ష్మిని అధికారికంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని కోటి 10 లక్షల మంది మహిళలు లబ్ధిదారులున్నారు. వీళ్లందరికీ ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వం. ఇందుకోసం రూ.17,500 కోట్ల నిధులు కేటాయించింది. కాంగ్రెస్ చెప్పింది చేసి తీరుతుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఒక్క క్లిక్‌తో అర్హులందరికీ ఆర్థిక సాయం అందుతుందని వెల్లడించారు. 


"ఎన్నికల ముందు కాంగ్రెస్ ఐదు హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెప్పిందంటే అది కచ్చితంగా చేసి తీరుతుంది. ఇప్పుడు ఒక్క క్లిక్‌తో లబ్ధిదారులందరి బ్యాంక్ అకౌంట్‌లలో రూ.2 వేలు జమ అవుతాయి"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ 






రూ.32 వేల కోట్లు 


మొత్తంగా ఈ పథకం కోసం రూ.32 వేల కోట్లు కేటాయించినట్టు వెల్లడించిన సిద్దరామయ్య..ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.18 వేల కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ఈ పథకం ద్వారా ఇంటికి కనీసం రూ.4-5 వేల మేర సాయం అందనుంది. ఈ స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని, తద్వారా జీడీపీపైనా సానుకూల ప్రభావం పడుతుందని ప్రభుత్వం తేల్చి చెబుతోంది. ఉద్యోగాల సృష్టిలోనూ ఇది తోడ్పడుతుందని వివరిస్తోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో సిద్దరామయ్య స్పందించారు. గౌతమ బుద్ధుడు, బసవేశ్వర, బీఆర్ అంబేడ్కర్ చూపిన బాటలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నామని వెల్లడించారు. మిగతా హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.