G20 Summit 2023: 



ఢిల్లీలో జీ 20 సదస్సు 


G 20 సదస్సుకి ఢిల్లీలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలీసులతో పాటు సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలోనే సౌత్ ఢిల్లీలోని మున్సిపల్ పార్క్‌లో అతి పెద్ద థీమ్ లోగోతో పాటు జీ20లోని సభ్య దేశాల జాతీయ పతాకాలనూ ఏర్పాటు చేశారు. వీటికోసం ప్రత్యేకంగా 20 స్తంభాలు అరేంజ్ చేశారు. గ్రేటర్ కైలాశ్‌లో ఉన్న ఈ ప్రాంతంలోని పార్క్‌ని ఇలా అలంకరించారు. సదస్సుకి వచ్చే అతిథులు తమ ఆతిథ్యాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చూడడమే తమ ఉద్దేశమని స్థానిక ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. సెప్టెంబర్ 9-10వ తేదీల్లో జీ20 సదస్సు జరగనుంది. ఢిల్లీలోని రోడ్లన్నీ అలంకరించారు. ఎక్కడా చెత్త కనబడకుండా క్లీన్ చేశారు. గోడలపై కొత్త పెయింట్స్ వేశారు. ఈ క్రమంలోనే పార్క్‌ని G 20 థీమ్‌తో అలంకరించారు. ప్రస్తుతం స్థానికులు ఈ పార్క్‌ని G 20 పార్క్‌గా పిలుస్తున్నారు.


"20 స్తంభాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. కాంక్రీట్ మిక్స్‌తో పాటు వుడెన్ టెక్ట్స్‌చర్‌తో వీటిని తయారు చేశాం. ప్రతి పిల్లర్‌పైనా G 20 దేశాల్లోని ప్రతి ఒక్క దేశానికీ ఓ జెండా అమర్చాం. ఇద్దరు ఆర్టిస్ట్‌లతో పాటు పది మంది కూలీలు ఇందుకోసం శ్రమించారు. ఈ పార్క్ చరిత్రలో నిలిచిపోవాలనే ఉద్దేశంతోనే ఇలా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం."


- ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ 






ఎప్పటికీ గుర్తుండిపోవాలనే..


అయితే...ఇదంతా మున్సిపల్ కార్పొరేషన్ ఫండ్స్ నుంచే ఖర్చు పెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఆ నిధులనే వినియోగించినప్పటికీ పెద్దగా ఖర్చు చేయలేదని స్పష్టం చేశారు. G 20 థీమ్‌ లోగో వెనకాల వరల్డ్ మ్యాప్‌ గీశారు. ఇక్కడికి వచ్చి వెళ్లే అతిథులు ఎప్పుడూ తమ ఆతిథ్యాన్ని మర్చిపోకూడదని, అందుకే ఇంతగా శ్రద్ధ పెడుతున్నామని వెల్లడించారు ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్. ఢిల్లీలోని పలు చారిత్రక కట్టడాలకూ పెయింట్స్ వేసి అందంగా తీర్చి దిద్దనున్నారు.