Amazon Manager Dies: 



ఢిల్లీలో హత్య..


ఢిల్లీలో దారుణం జరిగింది. అమెజాన్ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపారు దుండగులు. ఫ్రెండ్‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా హర్‌ప్రీత్‌ గిల్‌పై ఐదుగురు కాల్పులు జరిపారు. ఆగస్టు 29 అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరినీ ఐదుగురు దుండగులు అడ్డుకున్నారు. వెంటనే కాల్పులు జరిపారు. ఓ బులెట్‌ నేరుగా హర్‌ప్రీత్‌ తలలోకి దూసుకుపోవడం వల్ల అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అతని స్నేహితుడికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కేసులో నిందితులందరూ పరారీలో ఉన్నారు. ఈ ఘటన జరిగిన చోట సీసీ కెమెరాల్లోని ఫుటేజ్‌ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకూ ఎలాంటి ఆచూకీ దొరకలేదు. త్వరలోనే నిందితులందరినీ పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కాల్పులకు కారణమేంటన్నదీ ఇంకా తెలియాల్సి ఉంది. అన్ని కోణాల్లోనూ విచారించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. 


రెస్టారెంట్‌లో కాల్పులు..


బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని ఇటీవల ఓ రెస్టారెంట్‌లో కొందరు ఆగంతకులు ఉన్నట్టుండి కాల్పులు జరపడం స్థానికలం అలజడి సృష్టించింది. రెస్టారెంట్‌లో ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బులెట్ గాయాలు తగలకుండా మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. ఈ కాల్పులకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బేగుసరై జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఓ రిటైర్డ్ టీచర్‌ని దుండగులు కాల్చి చంపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దాదాపు 10 రౌండ్ల కాల్పులు జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే...ఇది కేవలం ప్రజల్ని భయాందోళనలకు గురి చేయడానికి జరిపిన కాల్పులే అని చెబుతున్నారు. కావాలనే ఓ వ్యక్తిని టార్గెట్‌గా చేసుకుని కాల్పులు జరపలేదని ప్రాథమిక విచారణలో తేలినట్టు వివరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి.