Khalid Latif:  పాకిస్తాన్ క్రికెటర్, గతంలో ఆ జట్టుకు సారథిగా కూడా వ్యవహరించిన ఖలీద్ లతీఫ్‌కు  నెదర్లాండ్స్ న్యాయవాదులు ఊహించని షాకిచ్చారు.  లతీఫ్‌కు 12 ఏండ్ల కారాగార శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. 2018లో  డచ్ (నెదర్లాండ్స్)కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు  గ్రీట్ విల్డర్స్‌ను హత్య చేయాలని పిలుపునిచ్చిన కేసులో లతీఫ్‌ను అరెస్టు చేయాలంటే  ఆ దేశ  న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఇలాంటి వాటిని సహించకూడదని లాయర్లు.. న్యాయమూర్తులను కోరారు.


ఏం జరిగిందంటే..? 


2018లో గ్రీట్ విల్డర్స్ మహ్మద్ ప్రవక్త మీద కార్టూన్ బొమ్మలు గీసినవారికి భారీ ప్రైజ్ మనీ  ఇస్తానని  ఓ పోటీని  నిర్వహించడానికి సిద్ధమయ్యారు. దీనిపై ముస్లిం దేశాలలోని ప్రజలు భగ్గుమన్నారు.  ఎవరెన్ని చెప్పినా తాను మాత్రం  ఈ పోటీని నిర్వహిస్తానని విల్డర్స్  స్పష్టం చేశాడు. అప్పుడు లతీఫ్.. విల్డర్స్‌ను  హత్య  చేసినవారికి 3 మిలియన్ పాకిస్తాని రూపీస్ (21 వేల యూరోలు)  నగదు బహుమానం అందజేస్తానని నెట్టింట ఓ వీడియోను పోస్ట్ చేశాడు. సామాజిక మాధ్యమాలలో ఈ వీడియో అప్పట్లో పెనుదుమారం రేపింది. పలు దేశాల నుంచి వ్యక్తమైన నిరసనల నేపథ్యంలో విల్డర్స్ ఆ తర్వాత కార్టూన్ పోటీని విరమించుకున్నారు.


అప్పుడే కేసు నమోదు.. 


లతీఫ్ చేసిన వ్యాఖ్యలపై డచ్‌లో కేసు నమోదైంది.  అతడిని కఠినంగా శిక్షించాలంటూ విల్డర్స్ మద్దతుదారులు  కోరారు. దీంతో అతడిని అరెస్టు చేయాలని కోరుతూ  డచ్..  ఇంటర్నేషనల్ వారెంట్  జారీ చేసింది.  లతీఫ్‌ను అమెస్టర్‌డామ్ (డచ్ రాజధాని) కు రావాలని, విచారణకు హాజరుకావాలని ఎన్నిసార్లు కోరినా అతడి నుంచి గానీ, పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి గానీ  స్పందన లేకపోవడంతో న్యాయవాదులు అతడికి జైలు శిక్ష విధించాలని కోరారు. మరి దీనిపై లతీఫ్, పాకిస్తాన్ ఎలా స్పందిస్తాయో చూడాలి. ఈ కేసులో తుది తీర్పు సెప్టెంబర్ 11న  వెలువడనుంది. 


 






ఎవరీ లతీఫ్..? 


ఖలీద్ లతీఫ్  పాక్ తరఫున 2008లో అరంగేట్రం చేశాడు. పాకిస్తాన్ తరఫున అతడు ఐదు వన్డేలు, 13 టీ20లలో పాల్గొన్నాడు.   వన్డేలలో 147, టీ20లలో 237 పరుగులు చేసిన లతీఫ్.. 20‌17లో పాకిస్తాన్‌ను కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో  పట్టుబడటంతో  పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అతడిపై ఐదేండ్ల  నిషేధాన్ని విధించింది.  2010లో  ఆసియా క్రీడలలో  లతీఫ్  పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కు సారథిగా కూడా వ్యవహరించాడు. అండర్ - 19 స్థాయిలో పాకిస్తాన్  గెలిచిన ప్రపంచకప్ టీమ్‌లో ఉన్న లతీఫ్.. ఆ జట్టులో కీలక ప్లేయర్ గా ఎదుగుతాడని భావించినా అతడి కెరీర్ మూన్నాళ్ల ముచ్చటే అయింది. 


గ్రీట్ విల్డర్స్ గురించి.. 


డచ్‌కు చెందిన ఈ వివాదాస్పద  రాజకీయ నాయకుడు నెటిజన్లకు సుపరిచితుడే.  భారత్‌లో రెండేండ్ల క్రితం  ఢిల్లీ బీజేపీ నాయకురాలు  నుపుర్ శర్మ  మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలను గట్టిగా సమర్థించాడు. నెదర్లాండ్స్‌లో అక్రమ వలసలపై ఆయన పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే విడుదలైన  ‘ది కేరళ స్టోరీ’ సినిమాను డచ్ పార్లమెంట్ లో ప్రదర్శించాలని కూడా డిమాండ్ చేసి వార్తల్లోకెక్కాడు. 


 



















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial