Asia Cup 2023: నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన ఆసియా కప్‌లో తొలిసారిగా రెండు దేశాలలో టోర్నీని నిర్వహించడంపై పాకిస్తాన్ క్రికెట్ జట్టు సారథి బాబర్ ఆజమ్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. వాస్తవానికి ఆసియా కప్ - 2023 ఆతిథ్య హక్కులు పాకిస్తాన్ వద్దే ఉన్నా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మాత్రం భద్రతా కారణాలతో పాక్‌కు వెళ్లేది లేదని స్పష్టం చేయడంతో భారత్ ఆడే మ్యాచ్‌లతో పాటు సూపర్ - 4 స్టేజ్, ఫైనల్ మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగనున్నాయి. కాగా ఈ మెగా టోర్నీ నేటి నుంచి మొదలుకానున్న నేపథ్యంలో హైబ్రిడ్ మోడల్‌పై పాక్ సారథి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నేపాల్‌తో నేడు ముల్తాన్ వేదికగా తలపడబోయే మ్యాచ్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాబర్ మాట్లాడుతూ.. ‘ఈ విషయంలో నేను చెప్పదలుచుకుంది ఒక్కటే.. ఆసియా కప్ మొత్తం పాకిస్తాన్‌లోనే జరిగితే ఎంతో బాగుండేది. కానీ దురదృష్టవశాత్తూ టోర్నీ రెండు దేశాలలో నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో మేం ఏమీ చేయగలం?’ అని వ్యాఖ్యానించాడు.
ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్ పై చాలామంది పాక్ మాజీలు బహిరంగంగానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో పాటు బీసీసీఐ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) పై దుమ్మెత్తిపోశారు. జావెద్ మియాందాద్, అబ్దుల్ రజాక్, షాహిద్ అఫ్రిది, షోయభ్ అక్తర్ వంటి దిగ్గజ క్రికెటర్లు పీసీబీ వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. తాజాగా బాబర్ కూడా అంత కటువుగా నిందించకపోయినా రెండు దేశాలలో నిర్వహించడంపై నిరాసక్తతను వెలిబుచ్చాడు. 13 మ్యాచ్‌లు ఉండే ఆసియా కప్‌లో ఆతిథ్య హోదాలో ఉన్న పాక్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిస్తుండగా ఫైనల్‌తో కలుపుకుని 9 మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది.
అయితే రెండు దేశాలలో నిర్వహించినా తామేమీ ఇబ్బందిపడటం లేదని, ప్రొఫెషనల్ క్రికెటర్లుగా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తామని బాబర్ చెప్పాడు. ‘టోర్నీలో మ్యాచ్‌లు ఆడేందుకు మేం రెండు దేశాలు తిరగాలని తెలుసు. దానికి మేమేం చింతించడం లేదు. ప్రొఫెషనల్ క్రికెటర్లుగా మేం దానికి సిద్ధమయ్యాం. రెండు దేశాల్లో ప్రయాణిస్తూ బ్యాక్ టు బ్యాక్ గేమ్స్ ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం’ అని చెప్పాడు. తమ కోచింగ్ సిబ్బంది, మెడికల్ టీమ్ అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారని, తాము సవాళ్లకు సిద్ధంగా ఉన్నామని బాబర్ తెలిపాడు.
నేపాల్‌తో మ్యాచ్‌కు ముందే ఫైనల్ లెవన్ ప్రకటన..
బుధవారం మధ్యాహ్నం నేపాల్‌తో జరుగబోయే తొలి మ్యాచ్ కోసం పాకిస్తాన్ ఫైనల్ లెవన్‌ను ప్రకటించింది. ఆరుగురు బ్యాటర్లు, ఇద్దరు స్పిన్ ఆల్ రౌండర్లు, ముగ్గురు పేసర్లతో పాకిస్తాన్ బరిలోకి దిగుతున్నది.
పాకిస్తాన్ తుదిజట్టు : ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్),క అఘా సల్మాన్ఖ,క ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, నసీమ్ షా, షహీన్ షా అఫ్రిది, హరీస్ రౌఫ్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial