Rahul Dravid:
టీమ్‌ఇండియా ప్రయోగాలపై మీడియాలో వస్తున్న ఊహగానాలకు కోచ్ రాహుల్ ద్రవిడ్ చెక్ పెట్టారు. రీసెంటుగా జట్టులో చేసిన మార్పుల వల్లే ప్రయోగాలపై అతిగా చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. ప్రయోగాలు చేయాలన్న తపనతో ప్రయోగాలు చేయడం లేదన్నారు. ఒకే సమయంలో ముగ్గురు ఆటగాళ్లు గాయాల పాలవ్వడంతోనే ఇతరులను పరీక్షిస్తున్నామని స్పష్టం చేశారు. ఆసియాకప్ సన్నాహక క్యాంపు ఆరంభం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
'నిజాయతీగా చెబుతున్నా. ప్రయోగాలు అన్న మాటకు అసలర్థంంతో కాకుండా ఇతర ఉద్దేశంతో ప్రచారం చేస్తున్నారు. మేం ఎందుకు ప్రయోగాలు చేస్తున్నామో కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటర్లపై ఎక్కువగా చర్చిస్తున్నారు. అసలు మాకు స్పష్టతే లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ మేం 18-19 నెలల ముందే 4, 5 స్థానాల్లో ఎవరు ఆడతారో చెప్పేశాం. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ పోటీలో ఉన్నారని వివరించాం' అని ద్రవిడ్ అన్నారు.
'మేం 18 నెలల క్రితం జట్లను ఎంపిక చేసినప్పుడే మాకెలాంటి సందేశాల్లేవు. ఆ ముగ్గురూ రెండు నెలల వ్యవధిలోనే గాయాల పాలవ్వడం దురదృష్టకరం. ఇలా జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు. మేం వన్డే, టీ20 ప్రపంచకప్‌లు, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌పై దృష్టి సారించాం. అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. అందరికీ గేమ్ టైమ్ ఇస్తున్నాం. ఆ రెండు స్థానాల కోసం పోటీపడుతున్న ముగ్గురూ గాయపడ్డారు' అని ద్రవిడ్ వెల్లడించారు.
'చిన్న గాయాలు కాదు. ఆ ముగ్గురికీ శస్త్రచికిత్సలు జరిగాయి. అలా జరిగితే ఎవరైనా స్పందించాల్సిందే కదా. ఆ ముగ్గురు లేనప్పుడు మిగతా వాళ్లను పరీక్షించాలి కదా. ఒక పెద్ద ఈవెంట్ లేదా ప్రపంచకప్‌కు సిద్ధంగా ఉండాలి కదా. మేం ఇతరులకు అవసరమైన గేమ్‌టైమ్ మాత్రమే ఇస్తున్నాం. ఆ పాత్రల్లో స్థిరపడేందుకు కావాల్సినన్ని అవకాశాలు కల్పిస్తున్నాం. మా లక్ష్యం అదే. కేఎల్ రాహుల్ బాగానే ఉన్నాడు. మేం అతడికి కొంత సమయం ఇవ్వాలని అనుకుంటున్నాం. ఆసియాకప్‌లో ఆడించి వన్డే ప్రపంచకప్‌కు సిద్ధం చేస్తాం. శిబిరంలో అతడు బ్యాటింగ్, ఫీల్డింగ్ బాగా చేశాడు. ప్రాక్టీస్ గేమ్స్ ఆడాడు. ఆసియా, ఆస్ట్రేలియా సిరీసులు ఆడిస్తాం' అని ద్రవిడ్ వివరించాడు.
ఐపీఎల్ - 16లో తొడ కండరాల గాయంతో సర్జరీ చేయించుకున్న రాహుల్.. రెండు నెలలుగా నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లోనే రీహాబిటేషన్ పొందుతున్నాడు. ఇటీవలే పూర్తిస్థాయిలో కోలుకున్న రాహుల్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లోనే ఎంపికవుతాడని ఆశించినా అలా జరుగలేదు. ఆసియా కప్‌లో జట్టుకు ఎంపికైన కెఎల్.. అలూరులో నిర్వహిస్తున్న టీమిండియా ప్రాక్టీస్ సెషన్స్‌లో బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్‌లో కూడా ప్రాక్టీస్ చేశాడు. కొద్దిరోజుల క్రితమే భారత ఆటగాళ్లందరికీ యో యో టెస్టు నిర్వహించగా రాహుల్‌కు మాత్రం ఇంకా అది పూర్తికాలేదు. పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్ సాధించకపోవడంతో రాహుల్, వారం రోజుల తర్వాత టీమిండియాతో కలువనున్నాడని ఎన్‌సీఏ వర్గాలు తెలిపాయి. రాహుల్ తో పాటే ఎన్‌సీఏలో రీహాబిటేషన్ పొందిన శ్రేయాస్ అయ్యర్ మాత్రం పూర్తిస్థాయిలో కోలుకుని మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు.
ఆసియా కప్‌కు భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమి, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణ - రిజర్వు ఆటగాడు: సంజూ శాంసన్