PAK vs NEP ODI: నేటి నుంచి  ప్రారంభం కాబోయే  ఆసియా కప్ - 2023లో  తొలి మ్యాచ్ ఆతిథ్య పాకిస్తాన్ - నేపాల్ మధ్య జరుగనుంది.  పాక్‌లోని ముల్తాన్  క్రికెట్ స్టేడియం ఇందుకు వేదిక కానుంది.  2018లో ఐసీసీ వన్డే హోదా పొంది.. ఇప్పుడిప్పుడే  అంతర్జాతీయ క్రికెట్‌లో బుడిబుడి అడుగులు వేస్తున్న నేపాల్‌కు ఒక అగ్రశ్రేణి జట్టుతో తలపడటం ఇదే తొలిసారి. స్వదేశంలో ఆసియా కప్‌ను ఘనంగా ఆరంభించి  భారత్‌తో మ్యాచ్‌కు సిద్ధం కావాలని   బాబర్ గ్యాంగ్ భావిస్తున్నది. 


నేపాల్‌ షాకిస్తుందా..? 


వన్డే హోదా పొందిన తర్వాత ఒక అగ్రశ్రేణి జట్టుతో వన్డేలు ఆడటం నేపాల్‌కు ఇదే తొలిసారి. గతంలో ఐసీసీ ఫుల్ మెంబర్ స్టేటస్ ఉన్న ఐర్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే‌లతో మాత్రమే నేపాల్ వన్డేలు ఆడింది. అయితే నేపాల్‌ ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరిగిన ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్‌‌లో యూఏఈ, హాంకాంగ్‌లను (ఈ రెండూ గతంలో  ఆసియా కప్ ఆడిన  జట్లే) ఓడించి ఆసియా కప్ ఆడేందుకు అర్హత సాధించింది. అదీగాక గడిచిన 12 వన్డేలలో ఆ జట్టు ఏకంగా 11 నెగ్గడం విశేషం. అనిశ్చితికి బ్రాండ్ అంబాసిడర్ అయిన పాకిస్తాన్.. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న షాకిచ్చేందుకు నేపాల్ సిద్ధంగా ఉంది.  ఆ జట్టులో చెప్పుకోదగ్గ ఆటగాళ్లు లేకపోయినా  పాక్‌కు గట్టిపోటీనిచ్చేందుకు  సిద్ధమైంది.  నేపాల్ టీమ్‌లో  మిడిలార్డర్ బ్యాటర్ దీపేంద్ర సింగ్‌కు  పలు  ఫ్రాంచైజీ టోర్నీల అనుభవముంది. దీపేంద్ర సింగ్.. షకిబ్ అల్ హసన్, ఆండ్రీ రసెల్ వంటి ఆటగాళ్లతో కలిసి ఆడాడు. బౌలర్లలో సందీప్ లమిచానె.. ఈ ఏడాది ఆడిన వన్డేలలో 42 వికెట్లు పడగొట్టి మంచి ఫామ్‌లో ఉన్నాడు. 


వార్ వన్ సైడే.. 


స్వదేశంలో చాలాఏండ్ల తర్వాత ఒక మెగా టోర్నీలో ఆడుతున్న పాకిస్తాన్.. ఈ టోర్నీని ఘనంగా ఆరంభించాలని  కోరుకుంటోంది. అందుకు తగ్గట్టుగానే ప్రత్యర్థి కూడా పసికూన కావడంతో  శనివారం (సెప్టెంబర్ 2) భారత్‌తో జరుగబోయే మ్యాచ్‌కు ముందు  దాయాది దేశానికి మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లభించనుంది. ఓపెనర్లుగా ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్‌తో పాటు వన్ డౌన్‌లో వచ్చే కెప్టెన్ బాబర్ ఆజమ్‌లు మంచి టచ్‌లో ఉన్నారు. మిడిలార్డర్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఫర్వాలేదనిపిస్తుండగా ఐదో స్థానంలో వచ్చే అఘా సల్మాన్ అయితే తన కెరీర్‌లోనే పీక్స్  ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది  స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన  వన్డే, టెస్టు సిరీస్‌తో పాటు ఇటీవలే ముగిసిన  శ్రీలంకతో రెండు టెస్టులలో  సల్మాన్ దుమ్మురేపాడు.  


బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో పాకిస్తాన్ దుర్బేధ్యంగా ఉంది. స్పిన్నర్లు  షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్  బంతిని గింగిరాలు తిప్పడంతో పాటు బ్యాటింగ్ చేయగల సమర్థులే. ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగేందుకు  పాకిస్తాన్ సిద్ధమైంది. షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రౌఫ్‌లు నేపాల్  బ్యాటర్లను ఆటాడుకునేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. 


తుది జట్లు (అంచనా): 


పాకిస్తాన్ : ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, అఘా సల్మాన్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రౌఫ్


నేపాల్ : కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్, భీమ్ షర్కి, రోహిత్ పుడెల్ (కెప్టెన్), కుశాల మళ్ల, దీపేంద్ర సింగ్, గుల్షాన్ ఝా, సోంపాల్ కమి, కరన్ కెసి, సందీప్ లమిచానె, లలిత్ రాజ్‌బన్సి 


 






వేదిక, మ్యాచ్ టైమింగ్స్ : 


ముల్తాన్ లోని ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో  బుధవారం భారత కాలమానం  3 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది. 


లైవ్ స్ట్రీమింగ్ : 


స్టార్ నెట్వర్క్ ఆసియా కప్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారాలను అందిస్తోంది. డిస్నీ హాట్ స్టార్‌లో ఉచితంగా మ్యాచ్‌లను వీక్షించొచ్చు. 
















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial