G20 Summit 2023: 


మూడు రోజుల సదస్సు..


ఢిల్లీలో సెప్టెంబర్ 9-10 వ తేదీల్లో G 20 సదస్సు (G 20 Summit) జరగనుంది. మోదీ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ సదస్సుని పకడ్బందీగా నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంది. పలు దేశాల అధినేతలతో పాటు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అందుకే...భద్రతను కట్టుదిట్టం చేశారు. మూడు రోజుల పాటు ఢిల్లీలో లాక్‌డౌన్ విధించనున్నారు. ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుందీ ఈ సమ్మిట్. ఈ రెండు, మూడు రోజుల పాటు ఎలాంటి ట్రాఫిక్‌ సమస్య కలగకుండా పూర్తిగా లాక్‌డౌన్ పెట్టారు. అంతే కాదు. పోలీసులు పలు చోట్ల తనిఖీలు చేపడుతున్నారు. ఆ రెండు రోజుల పాటు వ్యాపారాలూ బంద్ చేయాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌ హాజరు కానున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కీ భారత్ ఆహ్వానం పంపినప్పటికీ ఆయన రావడం లేదని తెలుస్తోంది. ఢిల్లీ, NCR ప్రాంతాల్లోని హోటల్స్‌లో రూమ్స్ బుకింగ్స్‌తో బిజీగా ఉన్నాయి. ITC Maurya, తాజ్ ప్యాలెస్, ది ఇంపీరియల్ సహా పలు ఫైవ్ స్టార్ హోటళ్లలోని రూమ్స్ బుకింగ్స్ పూర్తయ్యాయి. 


50 ఆంబులెన్స్‌లు రెడీ..


అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఐటీసీ మౌర్య హోటల్‌లో స్టే చేయనున్నారు. G 20 వెన్యూ వద్ద 50 ఆంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచనున్నారు. మెడికల్ స్టాఫ్‌ కూడా అందుబాటులో ఉంటుంది. హోటల్స్‌, ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ అవ్వాలని కేంద్రం ఆదేశించింది. మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితి తలెత్తితే వెంటనే చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేయాలని తేల్చి చెప్పింది. రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ వద్ద ఇందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో పాటు AIIMS వద్ద కూడా ఏర్పాట్లు చేశారు. లేబర్ కమిషనర్ ఆఫీస్‌తో పాటు ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీలోని వ్యాపారులందరికీ నోటీసులు పంపింది. జీ20 సదస్సు జరిగే తేదీల్లో దుకాణాలు మూసి వేయాలని స్పష్టం చేసింది. ఉద్యోగులకు పెయిడ్ హాలీడే ఇవ్వాలని పలు కంపెనీలను ఆదేశించింది. భద్రతా ఏర్పాట్లపై ఇప్పటికే దశల వారీగా సమావేశాలు నిర్వహించారు. ఈ మొత్తం ఏర్పాట్లకూ ఢిల్లీ పోలీసులే బాధ్యత వహిస్తున్నారు. CRPFకి చెందిన 50 టీమ్స్‌కి చెందిన 1000 మంది సిబ్బందితో భద్రత ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు 300 బులెట్ ప్రూఫ్ వాహనాలు సిద్ధం చేశారు. ఈ మూడు రోజుల పాటు ఢిల్లీలోని స్కూల్స్, కాలేజీలు మూతపడనున్నాయి. 


పుతిన్ డుమ్మా..


 G20 శిఖరాగ్ర సమావేశానికి పలు కారణాలతో హాజరుకాలేకపోతున్నట్లు పుతిన్ ప్రధాని మోదీకి వివరించారు. రష్యా తరఫున విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. రష్యా నిర్ణయాన్ని అంగీకరిస్తూ పుతిన్‌కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. G20 కార్యక్రమాలకు రష్యా మద్దతు కావాలని కోరారు. భారత్- రష్యా మధ్య ప్రత్యేకమైన, విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యం అభివృద్ధి చెందుతోందని క్రెమ్లిన్ అభిప్రాయపడింది. సెప్టెంబరు 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్‌కు 29 మంది దేశాధినేతలతో పాటు యూరోపియన్ యూనియన్ ఉన్నతాధికారులు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరు కానున్నారు.


Also Read: తళతళ మెరిసిపోతున్న ఢిల్లీ రోడ్‌లు, G 20 థీమ్‌తో ఓ పార్క్‌లో కళ్లు చెదిరే డెకరేషన్‌