Rice Price Hike in Global Markets: ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా బియ్యం ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల సంవత్సరంలో, మన దేశంలో బియ్యం రేట్లకు కళ్లెం వేసేందుకు, రైస్‌ ఎక్స్‌పోర్ట్స్‌ మీద కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో, ఇండియా నుంచి ఎగుమతులు తగ్గి ప్రపంచ రైస్‌ మార్కెట్‌లో (Global Rice Market) ధరలు 12 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇటీవలే, బాయిల్డ్ రైస్ ఎగుమతిపైనా ఇండియన్‌ గవర్నమెంట్‌ సుంకాన్ని పెంచింది.


80 శాతం పెరిగిన బియ్యం రవాణా ఖర్చులు 
భారత ప్రభుత్వం, ఈ ఏడాది జులై 20న బాస్మతీయేతర తెల్ల బియ్యం (Non- White Basmati Rice) ఎగుమతులను నిషేధించింది. ఇండియా నుంచి ఎక్స్‌పోర్ట్స్‌ ఆగిపోవడంతో పాటు బియ్యం రవాణా ఖర్చులు 80 శాతం పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా బియ్యం ధరలు చుక్కల్లో చేరాయి, ప్రస్తుతం 12 సంవత్సరాల గరిష్ట స్థాయిలో ఉన్నాయి. తాజాగా, బాయిల్డ్ రైస్ ఎగుమతిపైనా (Boiled Rice Export) భారత ప్రభుత్వం ఎగుమతి సుంకాన్ని పెంచింది. ఇప్పుడు బాయిల్డ్‌ రైస్‌ ఎక్స్‌పోర్ట్‌ మీద 20 శాతం ఎగుమతి సుంకం ఉంది. ఈ కారణంగా గ్లోబల్‌ మార్కెట్‌లో బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.


ఏటా ప్రపంచ మార్కెట్‌లోకి ఎగుమతి అవుతున్న 4 మిలియన్ టన్నుల బాస్మతి బియ్యంలో భారతదేశం వాటా 40 శాతం. ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, UAE, అమెరికాకు భారతదేశం బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేస్తుంది. 2022-23లో, మన దేశం, 4.8 బిలియన్ డాలర్ల విలువైన 45.6 లక్షల టన్నుల బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసింది. అదే కాలంలో, 6.36 బిలియన్ డాలర్ల విలువైన 17.79 మిలియన్ టన్నుల నాన్-బాస్మతి రైస్‌ను ఎక్స్‌పోర్ట్‌ చేసింది. భారతదేశం 2022-23లో 135.54 మిలియన్ టన్నుల బియ్యాన్ని, 2021-22లో 129.47 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేసింది.


బియ్యానికి కొరత ఏర్పడడంతో, కొన్ని ప్రపంచ దేశాలు ముందు చూపుతో ఆలోచిస్తున్నాయి. తమ దేశాల నుంచి బియ్యం ఎగుమతులను నిషేధించాలని యోచిస్తున్నాయి. ఐదో అతి పెద్ద బియ్యం ఎగుమతి దేశమైన మయన్మార్, తన ఎగుమతులను పరిమితం చేసే విషయాన్ని పరిశీలిస్తోంది. మరోవైపు, వర్షాలు లేకపోవడం వల్ల నీటిని ఆదా చేయడానికి వరి సాగును తగ్గించాలని థాయిలాండ్ ప్రభుత్వం తమ దేశ రైతులకు సూచించింది.


మన దేశంలోనూ దిగుబడి తగ్గవచ్చు!
ఈ సీజన్‌లో భారతదేశంలో వాతావరణ పరిస్థితులు చాలా విరుద్ధంగా ఉన్నాయి. భారత ప్రజల ముఖ్య ఆహారమైన బియ్యం ఉత్పత్తి ఈ సంవత్సరం 5 శాతం వరకు తగ్గవచ్చు. మన దేశంలోని వరి పంట వేసే పశ్చిమ బంగాల్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, బిహార్‌లో అసమాన వర్షాల కారణంగా ఈ సంవత్సరం వరి ఉత్పాదకత దెబ్బతినడమే దీనికి ప్రధాన కారణం. ఒడిశాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా వరి నాట్లు ఇప్పటికే ఆలస్యం అయ్యాయి. దేశంలోని తూర్పు ప్రాంతంలో వరిని సాగు చేసే చాలా రాష్ట్రాలు కూడా తక్కువ వర్షపాతం కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నాయి.


వ్యవసాయ పరిశోధనలు చేసే జాతీయ సంస్థ 'ఐకార్‌' (Indian Council of Agricultural Research - ICAR), స్వల్పకాలిక వరి పంట వేయాలని పశ్చిమ బంగాల్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాల రైతులకు సూచించింది. 


కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మూడో ముందస్తు అంచనా ప్రకారం.. 2023 ఆర్థిక సంవత్సరంలో (2022-23) ఖరీఫ్ బియ్యం ఉత్పత్తి 110.032 మిలియన్ టన్నులుగా ఉంది. 


మరో ఆసక్తికర కథనం: మీ ఆధార్‌ను 'ఫ్రీ'గా అప్‌డేట్‌ చేసే గడువు దగ్గర పడింది, ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోవద్దు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial