Telangana Joinings : తెలంగాణలో ఎన్నికల వేడి పెరుగుతోంది. రాజకీయ నాయకులు తమకు ప్రాధాన్యం లభించే పార్టీల్లోకి మారిపోతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కీలకమైన నేత సీతా దయాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇటీవలి వరకూ వారు టీడీపీలో ఉన్నారు. టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత  దయాకర్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. ఇటీవల చనిపోయారు. మక్తల్  , దేవరకద్ర నియోజకవర్గాల నుంచి  దయాకర్ రెడ్డి, ఆయన భార్య సీతా దయాకర్ రెడ్డి ఒకే సారి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ టీడీపీలోనే ఉన్నారు. రాష్ట్ర అవిర్భావం తర్వాత  కూడా కొనసాగినప్పటికీ ఇటీవల రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారాలనుకున్నారు. అనుచరులతో చర్చించి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నారు. ఈ లోపు దయాకర్ రెడ్డి మరణించారు. ఇప్పుడు సీతా దయాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకుంటున్నారు. ఇందు కోసమే రేవంత్  రెడ్డిని కలిశారు. 


కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి  కాంగ్రెస్ లో చేరినా టిక్కెట్ లభించేనా ? 


కొత్తకోట కుటుంబానికి  మక్తల్, దేవరకద్రల్లో పెద్ద ఎత్తున అనుచరగణం ఉంది. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికీ కాంగ్రెస్ కు బలమైన నాయకులు ఉన్నారు. పార్టీలో చేరినా .. సీతాదయాకర్ రెడ్డికి టిక్కెట్ లభించడం కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. అయితే  ముందుగా పార్టీలో చేరాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించే అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో మరికొంత మంది కీలక నేతలు చేరే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. 


బీజేపీ నుంచి రాజకీయాల్లోకి మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు                     


మరో వైపు   బీజేపీ సీనియర్‌ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌ రావు తనయుడు వికాస్  రావు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. ఆయన బీజేపీలో చేరనున్నారు.  హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వికాస్  రావును వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని విద్యాసాగర్‌రావు యోచిస్తున్నట్లు సమాచారం. వేములవాడ ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు సమీప బంధువు. అయితే ఈ సారి బీఆర్ఎస్ టిక్కెట్ రమేష్ బాబుకు ప్రకటించలేదు. ఆయనకు సలహాదారు పదవిని కేసీఆర్ ఇచ్చారు.  


రాజకీయ ఆరంగేట్రం చేస్తున్న పలువురు వారసులు                           


తెలంగాణలో  సీనియర్‌ నాయకుల వారసులు రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తున్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తనయుడు బీఆర్‌ఎస్‌ తరఫున అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి తనయులిద్దరూ వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ముందు ముందు మరికొంత మంది నేతలు ఇతర పార్టీల్లో చేరే అవకాశం ఉంది.