Virat Kohli: వన్డే వరల్డ్ కప్‌కు ముందు పాకిస్తాన్, శ్రీలంక వేదికగా జరుగనున్న ఆసియా కప్ ఆడేందుకు  శ్రీలంకకు పయనమైన  విరాట్ కోహ్లీ  వన్డే ఫార్మాట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టులలో  ప్రస్తుతానికి ఐసీసీ గుర్తించిన మూడు ఫార్మాట్లు  (టెస్టులు, వన్డేలు, టీ20)   ఉన్నా తనకు వ్యక్తిగతంగా వన్డేలు అంటేనే ఇష్టమని  కోహ్లీ చెప్పాడు.  దాని లోనే క్రికెటర్  అసలైన సత్తా బయటకు వస్తుందని, ఒక ఆటగాడికి పరీక్షలు పెట్టేది వన్డే క్రికెట్టేనని చెప్పుకొచ్చాడు. 


ఆసియా కప్ ప్రారంభానికి ముందు  కోహ్లీ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘నాకు  వన్డే క్రికెట్ ఆడటం చాలా ఇష్టం. నా వ్యక్తిగత అభిప్రాయం మేరకు.. ఈ ఫార్మాట్ ఒక ఆటగాడి సత్తాకు పరీక్ష పెడుతుంది.  మీ టెక్నిక్, సంయమనం,  పరిస్థితులకు తగ్గట్టు ఆటను మార్చుకోవడం, కఠిన పరిస్థుతులు ఎదురైనప్పుడు ప్రశాంతంగా ఉండటం వంటివన్నీ  ఈ ఫార్మాట్‌లోనే సాధ్యమవుతాయి. నా వరకైతే  వన్డే ఫార్మాట్ ఒక బ్యాటర్‌కు పరీక్ష వంటిది.  నాలోని  అత్యున్నత ఆటను  బయటకు తీసుకొచ్చింది కూడా వన్డే క్రికెటే. సవాళ్లను స్వీకరిస్తూ పరిస్థితులకు తగ్గట్టు ఆడుతూ నా జట్టు విజయం కోసం  ఆడటాన్ని నేను ఆస్వాదిస్తా..’అని చెప్పాడు. 


కోహ్లీ చెప్పినట్టుగానే వన్డేలలో ఈ  వెటరన్ బ్యాటర్‌కు ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటివరకూ 275 వన్డేలు ఆడిన కోహ్లీ.. ఏకంగా 57.32 సగటుతో 12,898 పరుగులు సాధించాడు. ఇందులో 46 సెంచరీలు, 65 అర్థ సెంచరీలు ఉన్నాయి.  ఛేదనలో మొనగాడిగా పేరున్న  కోహ్లీ.. లక్ష్యాన్ని సాధించే క్రమంలో అతడి సగటు 66గా ఉండటం గమనార్హం. కోహ్లీ కెరీర్‌లో 46 సెంచరీలు ఉంటే  అందులో ఏకంగా 26 శతకాలు   రెండోసారి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వచ్చినవే.  ఛేదనలో అత్యధిక సెంచరీలు చేసిన  బ్యాటర్ కూడా  కోహ్లీ పేరిటే ఉంది. 


 






2014లో తొలిసారి ఆసియా కప్  ఆడిన కోహ్లీ.. ఆసియా కప్‌లో ఇప్పటివరకూ 11 మ్యాచ్‌లు ఆడి 10 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్‌కు వచ్చి  613 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడి సగటు 61.30గా నమోదైంది. ఆసియా కప్‌లో కోహ్లీ 3  శతకాలు, ఒక అర్థ సెంచరీ సాధించాడు.  2‌018లో జరిగిన ఆసియా కప్ మిస్ అయిన కోహ్లీ గతేడాది యూఏఈలో నిర్వహించిన టోర్నీ (టీ20 ఫార్మాట్) లో మాత్రం దుమ్మురేపాడు. టీ20లలో కోహ్లీ తొలి శతకం కూడా గతేడాది (అఫ్గానిస్తాన్) నమోదైంది. మూడేండ్ల పాటు  ఫామ్ లేమితో సతమతమైన కోహ్లీ.. గతేడాది  ఆసియా కప్ ద్వారానే  పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. వన్డే వరల్డ్ కప్ ముందున్న నేపథ్యంలో వన్డే ఫార్మాట్‌లో నిర్వహించబోయే ఆసియా కప్‌లో కోహ్లీ రాణించాలని టీమిండియా ఫ్యాన్స్  కోటి ఆశలతో ఉన్నారు. 


 


















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial