అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. కర్ణాటక ఎన్నికల్లో విజయంతో తెలంగాణ కాంగ్రెస్ లోనూ జోష్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఒక అసెంబ్లీ సీటు కోసం 20 నుంచి 30 మంది పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే...ఏకంగా 1035 దరఖాస్తులు వచ్చాయ్. కొడంగల్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, జగిత్యాల నియోజకవర్గానికి జీవన్ రెడ్డి మాత్రమే దరఖాస్తు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లందు సీటుకు...ఏకంగా 31 మంది పోటీ పడుతున్నారు. 


రాష్ట్రం మొత్తానికి 1025 దరఖాస్తులు వస్తే...ఇందులో గ్రేటర్ పరిధిలోని సీట్ల నుంచి పోటీ చేసేందుకు 263 మంది పోటీ పడుతున్నారు. రెండు జిల్లాల్లోని 29 అసెంబ్లీ స్థానాలకు...ఊహించని విధంగా పోటీ ఏర్పడింది. తమకు అసెంబ్లీ సీటు కేటాయించాలంలూ...ఏకంగా 263 మంది టికెట్‌ అప్లికేషన్ పెట్టుకున్నారు. హస్తం పార్టీ తరపున కంటోన్మెంట్‌ సీటు కోసం 21 మంది పోటీ పడుతున్నారు. కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌ అసెంబ్లీ స్థానాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ రెండు చోట్ల నుంచి 16 మంది చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం అసెంబ్లీ సీట్లలో నాలుగో వంతు గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయ్. ఈ కారణంగా ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగేందుకు నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. 


గోషామహల్‌ నియోజకవర్గానికి 15, శేరిలింగంపల్లి, చేవెళ్ల స్థానాలకు 14 మంది చొప్పున పోటీ పడుతున్నారు.  కుత్బుల్లాపూర్‌కు 12. రాజేంద్రనగర్‌కు 11 , యాకుత్‌పురా, ఎల్‌బీనగర్‌ స్థానాలకు 10 చొప్పున దరఖాస్తులు వచ్చాయ్. ఇబ్రహీంపట్నం, ఖైరతాబాద్‌ స్థానాలకు 9 మంది, మహేశ్వరం, సనత్‌నగర్‌, ముషీరాబాద్‌లకు 8 మంది చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. మలక్‌పేట, కార్వాన్‌ స్థానాలకు ఏడుగురు చొప్పున, జూబ్లీహిల్స్‌, మేడ్చల్‌, ఉప్పల్‌, అంబర్‌పేట స్థానాలకు ఆరుగురు చొప్పున అభ్యర్థులు ఫోటీ పడుతున్నారు. చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా స్థానాలకు ఐదుగురేసి...ముగ్గురు చొప్పున మల్కాజిగిరి, పరిగి సీట్లకు దరఖాస్తులు పెట్టారు. 


మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అభ్యర్థుల జాబితా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. 13 నియోజకవర్గాలకు 85 మంది దరఖాస్తు చేసుకున్నారు. కరీంనగర్‌కు 15 దరఖాస్తులు వచ్చాయ్. జగిత్యాల స్థానానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. హుజూరాబాద్‌, కోరుట్లకు 13 చొప్పున, చొప్పుదండి, ధర్మపురి 7 చొప్పున, హుస్నాబాద్, రామగుండం స్థానాలకు ఆరుగురు చొప్పున పోటీ పడుతున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులపై నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ సర్వేలు చేయిస్తోంది. సర్వేల ఆధారంగా అభ్యర్థులకు టికెట్లు కేటాయించే అవకాశం ఉంది. సెప్టెంబరులో 40 నుంచి 50 మంది అభ్యర్థులతో తొలిజాబితాను రిలీజ్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. 


సెప్టెంబరు 2న కాంగ్రెస్ పార్టీ పీఈసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత....స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికపై సమావేశం కానుంది. డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలను సేకరించనుంది. ప్రతి పార్లమెంట్ స్థానంలో రెండు సీట్లను...బీసీలకు కేటాయించేలా హస్తం పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరోవైపు కమ్యూనిస్టులతోనూ...పొత్తులపై చర్చించనుంది. ఒక వేళ పొత్తులు కుదిరితే...2004 తర్వాత కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పని చేయనున్నారు. 


Also Read: బీఆర్ఎస్‌లో పెరుగుతున్న అసంతృప్త స్వరాలు - మార్పులుంటాయన్న ప్రచారమే కారణమా ?


Also Read: అభ్యర్థులను ప్రకటించక ముందే కాంగ్రెస్‌లో లొల్లి- కుటుంబానికి రెండు సీట్లు వ్యవహారంపై వాగ్వాదం