BRS Rebel Leaders :  భారత రాష్ట్ర సమితిలో అసంతృప్త స్వరాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. జాబితా ప్రకటించిన రోజు నుంచి సైలెంట్ గా ఉన్న నేతలు ఇప్పుడిప్పుడే బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. తమ నిర్ణయం తాము చేస్తామంటున్నారు. టిక్కెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలే కాదు ... టిక్కెట్ ఆశించిన వారు కూడా అదే తరహా ప్రకటనలు చేస్తున్నారు. అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కుల సంఘాలతో మద్దతుగా ప్రకటనలు చేయిస్తున్నారు. దీనంతటికి కారణం కొన్ని  మార్పులుంటాయని కేసీఆర్ చెప్పడమేనని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. బల ప్రదర్శన చేసి టిక్కెట్లు పొందాలనుకుంటున్నారని అంటున్నారు. 


హఠాత్తుగా మీడియాకు ఎక్కుతున్న నేతులు
 
ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి  టిక్కెట్ నిరాకరించిన తర్వాత ఇప్పటి వరకూ మాట్లాడలేదు. కానీ వారం అయినా కేసీఆర్ పిలిచి మాట్లాడలేదని..  ఒక్క సారిగా అసంతృప్తి వ్యక్తం చేశారు. తానే గ్రేటర్‌లో మొదటి ఉద్యమకారుడినని.. కానీ తనను బలిపశువును చేశారని ఆయనంటున్నారు. మేకపోతుని బలిచ్చే ముందు తనకు కనీసం మంచినీళ్లు తాగిస్తారని, అలాగే ఉరిశిక్ష పడ్డ ఖైదీని ఉరి తీసే ముందు తనకు చివరి కోరిక ఏమైనా ఉందా అని అడుగుతారని తన విషయంలో అటువంటి చివరి అవకాశం కూడా పార్టీ అధినాయకత్వం ఇవ్వలేదని వ్యాఖ్యానించారు సుభాష్ రెడ్డి. అయితే మరో 10 రోజులపాటు ప్రజల్లో విస్తృతంగా తిరుగుతానని ఆ తర్వాత పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఇక స్టేషన్ ఘాన్ పూర్ ఎమ్మెల్యే రాయ్యకూడా అదే చెబుతున్నారు. తన నిర్ణయం తాను తీసుకుంటానని కానీ తనకు ఇప్పటికీ చివరి నిమిషంలో టికెట్ వస్తుందన్న ఆశ ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కూడా టికెట్ ఆశించి భంగ పడ్డారు. ఈ స్థానం నుండి సునీత రెడ్డికి టికెట్ దక్కే అవకాశం ఉండడంతో పరోక్షంగా ఆమె పై కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు మదన్ రెడ్డి. తనకు టికెట్ దక్కకపోతే నియోజకవర్గంలో పార్టీ ముక్కలైపోతుందని అంటున్నారు మదన్ రెడ్డి. వీరితో పాటు మరికొందరు నాయకులు కూడా ఇదే విధంగా అసమ్మతి రాగాలు వినిపిస్తున్నారు. వీరిలో చాలా వరకు ఆఖరి నిమిషంలో పార్టీ ఫిరాయించడానికి ఇటు కాంగ్రెస్ తో అటు బిజెపితో ఇప్పటికే టచ్ లో ప్రచారం చేసుకుంటున్నారు. 


30కిపైగా స్థానాల్లో అభ్యర్థుల మార్పు ఉంటుందని ప్రచారం


అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కూడా సీఎం  కేసీఆర్ నియోజకవర్గాల్లో ఫ్లాష్ సర్వేలను చేయిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తిని అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నరు. దీంతో బీఆర్ఎస్‌లోనే కనీసం 30 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల సీట్లు మారుస్తారన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో బలప్రదర్శన చేసేందుకు నేతల తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తిని బయట పెట్టేందుకు రకరకాల టాస్క్‌లు ప్రయోగిస్తున్నారు. నియోజకవర్గాల్లో అసమ్మతి నేతల సమవేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఆయా ఎమ్మెల్యేలు చేసిన అవినీతి అక్రమాల గురించి ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. టిక్కెట్ ప్రకటించినప్పటికీ.. తమ వంతు ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. మార్పులు ఉంటాయన్న ప్రచారంతో మరింత ఉత్సాహంగా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. 


కుల సంఘాలను రంగంలోకి దింపుతున్న ఆశావహులు


కొంత మంది నేతలు కులు సంఘాలను రంగంలోకి దింపడం బీఆర్ఎస్‌లో చర్చనీయాంశమయింది. తెలంగాణలో ముదిరాజ్ సామాజికవర్గం నుంచి ఒక్కరికి కూడా బీఆర్ఎస్ టిక్కెట్ కేటాయించలేదు. ఆ సామాజికవర్గం నుంచి నీలం మధు అనే నేత పటాన్ చెరు టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్నారు. భారీగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. అయితే చివరికి టిక్కెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన  మహిపాల్ రెడ్డికే లభించింది. దీంతో  ముదిరాజ్ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాయి. చివరికి కేసీఆర్ నీలం మధును ప్రగతి భవన్‌కు పిలిపించి మాట్లాడారు. అయితే చివరికి తనకే టిక్కెట్ దొరకుతందని ఆయన ఆశలు పెట్టుకున్నారు. తాటికొండ రాజయ్య కూడా ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మద్దతుతో ప్రయత్నిస్తున్నారు. ఇంక పలువురు నేతలు అదే పని చేస్తూండటంతో ముందు ముందు బీఆర్ఎస్‌లో  ఈ  పంచాయతీలు ఎక్కువ అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. 


కేసీఆర్ విదేశాల్లో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత  పరిస్థితులు పూర్తిగా సద్దుమణుగుతాయని భావిస్తున్నారు.