Komatireddy Venkat Reddy:


ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 ఎమ్మెల్యే టిక్కెట్లను బలహీన వర్గాలకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. అవసరం అనుకుంటే నల్గొండ సీటును బీసీల కోసం త్యాగం చేయడానికి తాను సిద్ధమని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. మొదట్నుంచీ పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని, అభ్యర్థుల జాబితా షార్ట్ లిస్ట్ చేయవద్దని పీఈసీలో ఆయన సూచించారు.


గాంధీ భవన్ లో పీఈసీ సమావేశం అనంతరం కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నల్గొండ నియోజకవర్గం నుంచి 6 దరఖాస్తులు వచ్చాయన్నారు. వారి బలాబలాలు, పార్టీ కోసం చేసిన పని పరిశీలించి సమర్థులైన వారికే టికెట్లు ఇస్తామన్నారు. అవసరం అనుకుంటే నల్గొండ సీటును బీసీలకు వదిలేస్తానని స్పష్టం చేశారు. ఏఐసీసీ నేతలు పీఈసీ సభ్యులతో వన్ టూ వన్ మాట్లాడాలని టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి ప్రతిపాదించగా.. పార్టీ నేతలు ఆ ప్రతిపాదనను ఆమోదించినట్లు తెలిపారు. ఈరోజు జరిగిన సమావేశంలో అభ్యర్థుల షార్ట్ లిస్ట్ జరగలేదని చెప్పారు.


సాధ్యమైనంత త్వరగా సీట్ల పంపిణీ.. 
మేం సీఎం కేసీఆర్ లాగ ముదిరాజ్ లకు టిక్కెట్లు ఇవ్వకపోవడం లాంటి పనులు కాంగ్రెస్ చేయదన్నారు. తాము అన్ని కులాలు, వర్గాలను కలుపుకునిపోయేలా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 సీట్లు బలహీన వర్గాలకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సాధ్యమైనంత త్వరగా సీట్ల పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. సునీల్ కనుగోలు చేసిన సర్వే వివరాలను పరిశీలించి, తమ అభిప్రాయాలను సైతం సేకరించి.. అన్ని దరఖాస్తులను స్క్రీనింగ్ కమిటీకి పంపి సమర్థులైన వాళ్లకు టిక్కెట్ ఇచ్చి బరిలోకి దింపుతామన్నారు.


పీఈసీ మెంబర్లకు ఏఐసీసీతో పది నిమిషాల పాటు చర్చించే అవకావం ఇస్తే మెరుగైన ఫలితం ఉంటుందన్నారు. దళిత డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ ఇచ్చి తాము ఎన్నికలకు వెళ్తున్నామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ నేతల డిక్లరేషన్లు, హామీలపై బీఆర్ఎస్ నేతలు అవాక్కులు చవాక్కులు పేలుతున్నారంటూ మండిపడ్డారు. అయితే దళితుడ్ని తొలి ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ చెప్పింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ పని చేయకపోతే తల నరుక్కుంటా అని కేసీఆర్ చెప్పారని.. మాట తప్పారు కనుక ఫస్ట్ ఈ పని చెయ్ అంటూ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. తరువాత ఇప్పుడు మేం ఇచ్చిన డిక్లరేషన్ ను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్ని హామీలను నెరవేరుస్తామన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి అని ఆశచూపి మోసం చేశారంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణకు ఎదురుపడ్డారని అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డికి మేం ఎదురుతిరిగాం అన్నారు. 


నేటి సమావేశంలో ఒకే కుటుంబానికి రెండు టికెట్ల అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై కాంగ్రెస్ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయని సమాచారం. సర్వే ఆధారంగా టికెట్లు ఇచ్చేందుకైతే.. ఈ సమావేశాలు, కమిటీ ఎందుకు అంటూ కొందరు నేతలు ప్రశ్నించడంతో కాంగ్రెస్ పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.