IND vs PAK Playing 11: ఆసియా కప్ 2023లో శనివారం భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. దాయాది దేశం పాకిస్తాన్‌‌తో పోటీ పడనుంది. కప్‌ సాధించడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌ తరువాత భారత్, పాక్ తలపడడం ఇదే తొలిసారి. చాలా కాలం తరువాత రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు బలంగా కనిపిస్తోంది. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు భారత జట్టు బెంగళూరు శివార్లలో శిక్షణ పూర్తి చేసుకుంది. 


అలాగే ప్రత్యర్థి పాకిస్తాన్ సైతం జోరు మీద ఉంది. బాబర్ ఆజం నేతృత్వంలోని జట్టు నేపాల్‌ను 238 పరుగుల తేడాతో ఓడించింది. తాను కప్ రేసులో ఉన్నట్లు బలమైన సంకేతం పంపింది. తాజాగా భారత స్కిప్పర్ రోహిత్ సైతం పాకిస్తాన్‌తో పోరు అంత సులభం కాదని చెప్పాడు. పాక్‌తో పోరుకు అన్నివిధాలా సన్నద్ధంగా ఉన్నట్లు చెప్పారు. శ్రేయాస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా చేరికతో భారత‌ జట్టుకు బలం చేకూరింది. KL రాహుల్ ఆసియా కప్‌లో మొదటి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యారు. 


పాక్‌తో తలపడే భారత్ జట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్): బరిలో దిగితే బౌండరీలు బాదే రోహిత్ పాకిస్తాన్ పేస్ దిగ్గజం షాహీన్ అఫ్రిదిని ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. ఇలాంటి హై-వోల్టేజ్ గేమ్‌లో రోహిత్ కెప్టెన్సీ సామర్థ్యాన్ని కూడా పరీక్షించబోతున్నాయి.


శుభ్‌మాన్ గిల్: ఓపెనర్ ఆకట్టుకోవడంలో శుభ్‌మాన్ గిల్ విఫలమయ్యాడు. IPL 2023లో అతని అద్భుతమైన ప్రదర్శన తర్వాత అతనిలో ఆత్మవిశ్వాసం, ప్రదర్శన రెండూ తగ్గిపోయాయి. శనివారం జరిగే పెద్ద ఆటలో ఈ స్టార్ ఫామ్ లోకి రావాలని ఇండియా ఆశిస్తోంది.


విరాట్ కోహ్లీ: ప్రత్యర్థి ఎవరైనా లెక్కచేయని స్టార్ బ్యాటర్ కోహ్లీ ఈ మధ్య మంచి ఫాంలో కనిపిస్తున్నాడు. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌ అతని ఆటతీరుకు పెద్దపీట వేయనుంది. భారత్‌కు కొండంత బలంగా నిలవబోతోంది.


శ్రేయాస్ అయ్యర్: గాయం నుంచి కోలుకుని జట్టులో స్థానం సంపాదించుకున్న అయ్యర్ ప్రత్యర్థిని దీటుగా ఎదుర్కొనేలా ప్రణాళికలు రచించుకోవాలి. మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం అయ్యర్‌కు ఆందోళన కలిగించవచ్చు. కానీ గత అనుభవం ఉపయోగపడనుంది.


ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్): కేఎల్ రాహుల్ అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో ఇషాన్ కిషన్ వికెట్ కీపర్‌గా ఆడనున్నాడు. వెస్టిండీస్‌పై వరుసగా మూడు వన్డే అర్ధసెంచరీలు చేసి మంచి ఊపు మీద ఉన్నాడు.


హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్): భారత్ జట్టులో పాండ్యా మరో కీలక ఆటగాడు. 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల అరుదైన ఆల్ రౌండర్లలో హార్దిక్ ఒకరు. గతంలో కూడా పాకిస్తాన్‌పై మంచి ప్రదర్శన ఇచ్చాడు. శనివారం సైతం అలాంటి ప్రదర్శనను పునరావృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.


రవీంద్ర జడేజా: ప్లేయింగ్ XIలో ఆటగాడు ఉండటం జట్టుకు మరింత సమతుల్యతను అందిస్తుంది. జడేజా బంతితో పాటు బ్యాటుతో రాణించగలడు. కీలకమైన నాక్‌లు ఆడడంలో ముందుంటాడు. మ్యాచ్‌ను బంతితో టర్న్ చేయగల సామర్థ్యం ఉన్న బౌలర్. జడేజా తరచుగా పొదుపుగా బౌలింగ్‌ చేయడం మరో విశేషం.


కుల్దీప్ యాదవ్ : ఎడమచేతి మణికట్టు స్పిన్నర్ అద్భుతంగగా రాణిస్తున్నాడు. కీలక సమయాల్లో వికెట్లు తీయగల సత్తా ఉన్నవాడు. 


జస్ప్రీత్ బుమ్రా: చాలా కాలం తరువాత ఏస్ పేసర్ భారత క్రికెట్ జట్టులోకి తిరిగి వచ్చాడు. తన పునరాగమన మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో మంచి ప్రదర్శన ఇచ్చాడు. అతను భారత బౌలింగ్ దాడికి నాయకత్వం వహిస్తాడు. బూమ్రా ప్రదర్శన ఆటలో కీలక పాత్ర పోషిస్తుంది.


మహ్మద్ సిరాజ్ : రైట్ ఆర్మ్ పేసర్ గత కొన్నేళ్లుగా ఉత్తమ బౌలింగ్ చేస్తున్నాడు. అంతర్జాతీయ ర్యాంగింగ్‌లో పైకి వచ్చాడు. నియంత్రిత దూకుడు, ఎప్పటికప్పుడు తన బౌలింగ్‌ను మెరుగుపరుచుకుంటూ సిరాజ్‌ను ప్రత్యర్థులకు కఠినమైన బౌలర్‌గా రాణిస్తున్నాడు. శనివారం జరిగే మ్యాచ్‌లో అవకాశం దక్కే అవకాశం ఉంది.


మహ్మద్ షమీ: వెస్టిండీస్, ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో రైట్ ఆర్మ్ పేసర్‌కు విశ్రాంతి ఇచ్చారు. జూన్ ప్రారంభంలో చివరిసారి ఆడాడు. అయినా బంతితో మ్యాచ్‌ను నియంత్రించగలితే సామర్థ్యం ఉన్నవాడు. పాకిస్తాన్‌తో జరిగే భారీ గేమ్‌లో భారత్‌కు షమీ అనుభవం ఉపయోగపడనుంది.


మ్యాచ్‌ వివరాలు.. 


- శనివారం మధ్యాహ్నం 3 గంటలకు  క్యాండీలోని పల్లెకెలె వేదికగా  మ్యాచ్ జరుగనుంది. 


లైవ్ చూడటం ఎలా..? 


- ఈ మ్యాచ్‌ను లైవ్‌లో వీక్షించాలంటే  టెలివిజన్ ‌లో అయితే స్టార్ నెట్వర్క్   హిందీ, ఇంగ్లీష్‌తో  పాటు స్థానిక  భాషలలోని తన ఛానెళ్లలో కూడా ప్రసారం చేస్తున్నది.  


- మొబైల్స్‌లో అయితే   డిస్నీ హాట్ స్టార్ యాప్‌లో  ఉచితంగానే వీక్షించొచ్చు. 
 
పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు భారత తుది జట్టు (అంచనా) : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా,  రవీంద్ర జడేజా,  కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా 


పాకిస్తాన్ : ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అఘా, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, హరీస్ రవూఫ్, నసీమ్ షా, షహీన్ షా ఆఫ్రిది
















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial