Bonalu in Hyderabad 2024: సృష్టికి మూలమైన శక్తిరూపంగా  దుర్గ, కాళి, లలిత సహా ఎన్నో రూపాల్లో పూజలందుకుంటోంది అమ్మవారు. దుష్టసంహరణార్థం అవతారాలెత్తిన శక్తి..గ్రామాల్లో ప్రజల ఆరోగ్యాన్ని, పాడిపంటల్ని రక్షించేందుకు గ్రామదేవతలుగా, గ్రామ రక్షకులుగా కొలువుతీరారు. వాళ్లే  ఎల్లమ్మ, రేణుక, జగదాంబ, చండీ, మహంకాళి, దుర్గ, పోశమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, డొక్కలమ్మ, కట్టమైసమ్మ, గండిమైసమ్మ... ఒక్కో ఊరిలో ఒక్కో పేరుతో పిలిచినా, కొలిచినా...అమ్మ కరుణాకటాక్షాలు అందరిపైనా సమానంగా ఉంటాయి. అందుకు కృతజ్ఞతగానే ఏటా ఆషాడమాసంలో నెలరోజులూ ఊరూ వాడా సంబురంగా బోనాలు నిర్వహిస్తారు.అమ్మను ఆడబిడ్డగా భావించి పుట్టింటికి ఆహ్వానించి సకల మర్యాదలు చేసి..చీర సారె పెట్టి సాగనంపుతారు. ఇలా చేస్తే ఏడాది మొత్తం అమ్మవారి కరుణా కటాక్షాలు తమపై ఉంటాయని భక్తుల విశ్వాసం.  జూలై 7న గోల్గొండ జగదాంబ అమ్మవారితో మొదలయ్యే బోనాలు ఆగష్టు 4 సికింద్రాబాద్‌ ఉజ్జయిని అమ్మవారి మహంకాళి జాతరతో ముగుస్తుంది. లాల్‌ దర్వాజ తదితర ప్రాంతాల్లోనూ ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. 


Also Read: అమ్మకు బోనం.. ఆధ్యాత్మిక సంబురం మాత్రమే కాదు అంటు వ్యాధులు తరిమేసే ఆయుధం!


ఆరు శతాబ్దాల క్రితం నుంచి బోనాలు...


కొండకోనల్లో ఉండేవారు రాయిని దేవతంగా చేసుకుని ప్రకృతి తమకు ఇచ్చిన ఆహారాన్ని కృతజ్ఞతా పూర్వకంగా కొత్త కుండలో సమర్పించడాన్నే బోనం అనేవారు. అప్పట్లో ప్రకృతి నుంచి దొరికే  పత్రి, పూలు, ఆకులు, కొమ్మలు, నీళ్లు, పసుపు కుంకుమ, ధాన్యం, కూరగాయలు ఇవన్నీ సమర్పించేవారు. రాను రాను పద్ధతులు మారుతూ వచ్చాయి. ఆరువందల ఏళ్లక్రితం పల్లవ రాజుల కాలంలో తెలంగాణ నేలపై బోనాల పండుగ ప్రాశస్త్యం పొందిందని చెబుతారు.  15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవ‌రాలు ఏడు కోల్ల ఎల్ల‌మ్మ న‌వదత్తి ఆల‌యాన్ని నిర్మించి అప్పట్లో బోనాలు సమర్పించి మొక్కులు సమర్పించారట. 1676లో క‌రీంన‌గ‌ర్ హుస్నాబాద్‌లో ఎల్ల‌మ్మ‌గుడిని స‌ర్వాయి పాప‌న్న క‌ట్టించి అక్కడ అమ్మకు బోనం సమర్పించాడని   కైఫీయ‌తుల్లో గౌడ‌నాడులు గ్రంథంలో ఉంది.


Also Read: ఆషాఢ అమావాస్య రోజు ఈ ఒక్కటీ చేస్తే మీ కుటుంబానికి ఉన్న పితృదోషం తొలగిపోతుంది!


హైదరాబాద్ లో బోనాలు 


హైదరాబాద్ లో  బోనాల సందడి  విషయానికొస్తే 1869లో జంట‌న‌గ‌రాల్లో ప్లేగు వ్యాధి మ‌హ‌మ్మారిలా వచ్చి పడింది. ప్రజలంతా పిట్టల్లా రాలిపోయారు. ఆ సమయంలో అమ్మవారి ఆగ్రహానికి గురయ్యామని భావించిన ప్రజలంతా అమ్మను శాంతపరిచేందుకు  చేపట్టిన క్రతువే ఈ బోనాలు అని చెబుతారు.  గోల్కొండ‌ను పాలించిన  తానీషా  కాలంలో బోనం పండుగ హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైందని చరిత్రకారులు అంటారు. మరీ ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నివారణ కోసం ఈ బోనాలు పండుగ నిర్వహించడం మొదలైందంటారు ఆరోగ్యనిపుణులు. అందుకే బోనం కుండకు పసుపు రాసి వేపాకులు కట్టడమే కాదు.. పసుపు నీళ్లు విరివిగా చల్లడం కూడా ఇందులో భాగమే అంటారు.  


Also Read: బోనాలు, రథయాత్ర, తొలి ఏకాదశి, గురుపూర్ణిమ సహా జూలై నెలలో ఎన్ని పండుగలో!


బోనం అంటే


బోనం అంటే భోజనం.. ప్రకృతి ప్రసాదించిన వాటిని నైవేద్యంగా మార్చి తిరిగి అమ్మకు సమర్పించడమే బోనం. సర్వం సిద్ధం చేసిన తర్వాత బోనం కుండను తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య ప్రదర్శనగా వెళ్లి అమ్మకు సమర్పిస్తారు. విస్తారంగా వానలు కురువాలని, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటారు. కొందరు అమ్మవారికి బోనంతో పాటు సాక సమర్పిస్తారు. చిన్న మట్టిపాత్రలో నీళ్లుపోసి చక్కెర, బెల్లం కలిపి పానకాన్ని తయారు చేసి..అందులో వేపకొమ్మను ఉంచి అమ్మవారికి నైవేద్యం పెడతారు. బోనాల పండుగ  ఊరేగింపులో పోతురాజులు, శివసత్తుల విన్యాసాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.  


Also Read: భాగ్యనగరంలో ఆషాఢ మాసం బోనాల జాతర సందడి..జగదాంబికకు జూలై 7న తొలి బోనంతో ఉత్సవాలు ప్రారంభం!


జూలై 07 నుంచి ఆగష్టు 04 వరకూ బోనాలు


జ్యేష్టమాసంలో అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమి నుంచి ఆషాడమాసం ప్రారంభమవుతుంది. ఆషాడం ప్రారంభమైన తర్వాత వచ్చే గురువారం కానీ ఆదివారం అయినా బోనాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది జూలై 07 ఆదివారం  గోల్కొండలో బోనాలు ప్రారంభమై ఆగష్టు 04 ఆదివారంతో ముగుస్తాయి..