Indian Women Cricket Team: టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్ (T20 World Cup 2024 Finals) లో దక్షిణాఫ్రికాపై ఘన విజయాన్ని సొంతం చేసుకుని మెన్స్ టీమ్ ఇచ్చిన ఆనందాన్ని.. రెట్టింపు చేసింది మన దేశ మహిళల క్రికెట్ జట్టు (Indian women cricket team). అదే దక్షిణాఫ్రికాకు చెందిన మహిళల జట్టు (South African Women Cricket Team) పై 10 వికెట్ల తేడాతో.. ఏకైక టెస్టులో (Ind vs SA test) అద్భుత విజయాన్ని దక్కించుకుంది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో.. ఆల్ రౌండ్ ప్రతిభను ప్రదర్శించి.. హోమ్ కంట్రీలో తమ జోరుకు బ్రేకులు వేసే వారు లేనేలేరని భారత మహిళల క్రికెట్ జట్టు మరోసారి నిరూపించింది.


మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతీ మందన్నా జోరుతో భారీ స్కోరు సాధించింది. 8 సిక్సులు, 23 ఫోర్లతో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన షెఫాలీ 205 పరుగులు చేసి.. డబుల్ సెంచరీని ఖాతాలో వేసుకుంది. 27 ఫోర్లు, 1 సిక్స్ తో షెఫాలీకి తోడుగా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన స్మృతీ.. 149 పరుగులు చేసింది. రోడ్రిగ్స్ 55.. హర్మన్ ప్రీత్ 69.. రిచా ఘోష్ 86 పరుగులు చేయడంతో.. తొలి ఇన్నింగ్స్ ను 603 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది.. భారత జట్టు. తర్వాత ఛేజింగ్ లో ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయిన దక్షిణాఫ్రికా.. 266 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సూనే 65.. మరిజానే 74.. అనేకే 39.. నదినే 39 పరుగులు మినహా.. మిగతా ఎవరూ అంతగా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. భారత బౌలర్ స్నేహా రాణా.. ఏకంగా 8 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించింది. దీప్తీ శర్మ మిగతా 2 వికెట్లు సొంతం చేసుకుంది.


తొలి ఇన్నింగ్స్ లో 337 పరుగులు వెనకపడి.. ఫాలో ఆన్ ఎదుర్కొన్న దక్షిణాఫ్రికా జట్టు.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం కాస్త నిలదొక్కుకుంది. ఓపెనర్ లారా 122.. వన్ డౌన్ లో వచ్చిన సూనే 109.. నదినె 61.. మరిజానా 31 పరుగులు చేయడంతో.. 373 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించింది. ఈ ఇన్నింగ్స్ లో భారత మహిళా బౌలర్లు సమిష్టిగా రాణించి.. దక్షిణాఫ్రికా మరింత భారీ స్కోరు చేయకుండా కట్టడి చేయగలిగారు. స్నేహ, దీప్తి, రాజేశ్వరి చెరో 2 వికెట్లు తీయగా.. పూజా, షెఫాలీ, హర్మన్.. తలా  ఒక వికెట్ తీశారు. 37 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని.. భారత మహిళల జట్టు కేవలం 9.2 ఓవర్లలో పూర్తి చేసి.. 10 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై మరపురాని విజయాన్ని అందుకుంది. మ్యాచ్ మొత్తంలో.. 10 వికెట్లు తీసి పర్యాటక జట్టును కుప్పకూల్చిన స్నేహ రాణా.. ప్లేయర్ ఆప్ ద మ్యాచ్ అవార్డును అందుకుంది.


రోహిత్ శర్మ సారథ్యంలోని భారత పురుషుల క్రికెట్ జట్టు సాధించిన విజయంతో ఉప్పొంగిపోయిన యావత్ భారత దేశం.. మన దేశ మహిళల క్రికెట్ జట్టు సైతం సాధించిన గెలుపుతో మరోసారి పులకించిపోయింది. ఈ గెలుపు ఇలాగే కొనసాగి పురుషులు, మహిళల క్రికెట్ జట్లు.. మరిన్ని ఘన విజయాలను దేశానికి అందించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.