Malkajgiri News: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. మౌలాలి ఆర్టీసీ కాలనీలో కొన్ని నెలలుగా మెయిన్ రోడ్ మర్మతులు చేయకుండా అలాగే వదిలేశారు. దీంతో స్థానిక ప్జలు ఎమ్మెల్యే ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పలుమార్లు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. అయినా అధికారులు గానీ.. రాజకీయ నాయకులు గానీ పట్టించుకోవడం లేదని ధర్నాకు దిగారు. మెయిన్‌ రోడ్‌కు రిపేర్లు చేయకుండా అలాగే వదిలేశారని స్థానికులు ఎమ్మెల్యే పై మండిపడ్డారు. స్థానికుల ఇబ్బందులపై ఎమ్మెల్యే పలు మార్లు అధికారులతో చర్చించిన ఫలితం లేకపోయిందని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. 


మైనంపల్లి చొరవతో రోడ్డు నిర్మాణం
చివరికి మల్కాజిగిరి  మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చొరవతో ప్రస్తుతం రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఈ క్రమంలో ప్రారంభమైన రోడ్డు మరమ్మతు పనులను పర్యవేక్షించడానికి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి వెళ్లారు. దీంతో స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎమ్మెల్యేతో వాగ్వివాదానికి దిగారు. ఇన్ని రోజులు మేం పడుతున్న కష్టాలు పట్టించుకోలేదు గానీ..  ఇప్పుడు మైనంపల్లి చొరవతో పనులు జరుగుతుంటే చూడ్డానికి వస్తారా అంటూ నిలదీశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు మధ్య తోపులాట జరిగింది. ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.   


కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి, ఎమ్యెల్యే?
 కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ వలసల పర్వం కొనసాగుతోంది. బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వీరు పార్టీలో చేరడాన్ని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట.  దీంతో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి త్వరలోనే అన్ని అడ్డంకులను తొలగించి మామా అల్లుళ్లను కాంగ్రెస్‌లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌కు చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పార్టీ మారడం దాదాపు ఖాయమని, వారం రోజుల్లోపు ఎప్పుడైనా బీఆర్ఎస్ వీడనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం  జరుగుతోంది. ఇదే విషయమై ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని సంప్రదించగా... ‘‘పార్టీ మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కార్యకర్తల అభిప్రాయం తీసుకున్న తర్వాత చేరికపై నిర్ణయం తీసుకుంటా’ అని చెప్పుకొచ్చారు.