Bhadradri Sri Rama Navami celebrations 2024: శ్రీ క్రోధి నామ సంవత్సరం శ్రీ రామ నవమి వేడుకలు దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాద్రిలో ఘనంగా మొదలయ్యాయి. ఉగాది పర్వదినం రోజున మొదలైన బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 వరకూ జరగనున్నాయి. ఏప్రిల్ 17 బుధవారం రోజు సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఏటా శ్రీరామనవమి కళ్యాణ వేడుకకు వేదికగా నిలిచే మిథిలా స్టేడియంలో సుమారు 20 వేల మంది ఒకేసారి వీక్షించేలా సీతారాముల కల్యాణోత్సవం జరుగుతుంది. ఆరు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ కట్టడం ఈ శతాబ్దంలోనే అద్భుత కట్టడాలలో ఒకటిగా చరిత్రకెక్కింది. రామాయణంలో ప్రధాన ఘట్టాలను, రామదాసు భద్రాద్రి ఆలయాన్ని నిర్మిస్తున్న సమయంలో జరిగిన సంఘటనలను ఈ కళ్యాణ మండపంపై  చెక్కారు. తమిళనాడు ప్రాంతానికి చెందిన ప్రముఖ శిల్పకళాకారుడు గణపతి స్తపతి ఈ మిథిలా స్టేడియాన్ని నిర్మించారు.


Also Read: అధికార పీఠం కోసం కుట్రలు జరిగే ఈ రోజుల్లో - రామాయణంలో ఈ క్యారెక్టర్ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే!


భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
రాములోరి కళ్యాణానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు  ద‌ర్శ‌నానికి వచ్చే భ‌క్తుల కోసం ప్ర‌త్యేక టిక్కెట్లను ఆన్‌ లైన్లో విక్రయిస్తున్నారు. ఈ స్పెషల్ టికెట్ల ద్వారా సీతారాముల కళ్యాణాన్ని దగ్గర్నుంచి చూడొచ్చు. రూ.7,500, రూ.2,500, రూ.2 వేలు, రూ.1000, రూ.300, రూ.150 విలువైన టికెట్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయని, అదేవిధంగా మిథిలా మండపానికి సమీపంలో రామయ్య కల్యాణోత్సవ వేడుకను దగ్గర నుంచి చూసేందుకు గాను రూ.10 వేలు, రూ.5 వేల టికెట్లను కూడా విక్రయిస్తున్నారు. మరోవైపు భద్రచలం రాములోరి తలంబ్రాలు భక్తులకు అందించేందుకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. తలంబ్రాలు కావాల్సిన వారు ఆర్టీసీ ద్వారా ఈ నెల 18 వరకు బుక్‌ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు టీఎస్‌ఆర్టీసీ హోం డెలివరీ చేస్తుంది. 


Also Read: శ్రీ సీతారాముల కళ్యాణ వైభోగం అక్కడ చాలా చాలా ప్రత్యేకం!


ఏప్రిల్ 17  శ్రీరామ నవమి
ఏప్రిల్ 17వ తేదీ శ్రీ రామ నవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణం ఉదయం పదిన్నర నుంచి ఒంటిగంటవరకూ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మర్నాడు ఏప్రిల్ 18 తేదీ  పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 19 న హంస వాహన సేవ, ఏప్రిల్ 20న తెప్పోత్సవం - అశ్వవాహన సేవ, ఏప్రిల్ 21న ఊంజల్ ఉత్సవం - సింహ వాహన సేవ, ఏప్రిల్ 22 న వసంతోత్సవం -గజ వాహన సేవ నిర్వహించి.... ఏప్రిల్ 23 చక్రతీర్థం, పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి..ఈ ఉత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటూ ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివెళతారు. ఈ మేరకు బస చేసేందుకు వీలుగా గదులను ఆన్ లైన్ లోనే బుక్ చేసుకునే అవకాశం కల్పించింది భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయం. https: //book.bhadrachalamonline.com/book-hotel 


Also Read: ఈ తరం పిల్లలకి రామాయణం గురించి అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ ఆలయానికి వెళ్లండి!