Minister RK Roja: సీఎం జగన్‌పై విజయవాడ ఎన్నికల ప్రచార రోడ్ షోలో జరిగిన రాయి దాడిని ఖండిస్తూ మంత్రి రోజా రోడ్డుపై నిరసన చేపట్టారు. చిత్తూరు జిల్లా పుత్తూరులోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట రోడ్డుపై బైఠాయించి మంత్రి ఆర్కే రోజా నిరసన తెలిపారు. దాడికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈసీ తక్షణమే జోక్యం చేసుకోవాలని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుట్రలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్‌కు ప్రజల్లో వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే చంద్రబాబు ఈ కుట్ర దాడి చేయించారని మంత్రి రోజా ఆరోపించారు.
ప్రజలు అభిమానించే నాయకుడిని చంపి అధికారంలోకి రావాలని చంద్రబాబు కుట్ర, కుతంత్రాలు చేస్తున్నారని రోజా ఆరోపించారు. గతంలో ఐదేళ్ల క్రితం జగన్ ను విశాఖ ఎయిర్ పోర్టులో కత్తితో పొడిచి చంపాలని చూశారని.. ఇప్పుడు వీధి దీపాలు ఆపేసి ఈ విధంగా కుట్రకు పాల్పడ్డారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పై దాడితో రాష్ట్ర ప్రజలందరూ కన్నీటి పర్యంతం అవుతున్నారని అన్నారు. జగన్ రక్తం చూసిన మీకు మే 13న ప్రజలు ఓట్లతో మీకు రక్తకన్నీరు తెప్పిస్తారని రోజా వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల సంఘం సీరియస్
సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటనను ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా.. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణాకు ఫోన్ చేసి వివరాలను ఆరా తీశారు. ఈ ఘటనపై ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకున్నారు. తమకు పూర్తి నివేదికను పంపించాలని ఆదేశించారు. దాడికి పాల్పడ్డ నిందితులను త్వరగా గుర్తించాలని నిర్దేశించారు.
మరోవైపు, సీఎం జగన్ పై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు వేగవంతం చేశారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం క్షుణ్ణంగా పరిశీలించింది. ఘటన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పూర్తిగా చీకటి, చెట్లు ఉన్న చోటి నుంచి నిందితుడు ఎవరికీ కనిపించకుండా.. దాడి చేశారని తెలుస్తోంది. అక్కడి నుంచి నిందితుడు సులభంగా తప్పించుకున్నట్లు భావిస్తున్నారు. దాదాపు 30 అడుగుల దూరం నుంచి రాయిని బలంగా విసిరినట్లు భావిస్తున్నారు.