తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) ఫుల్‌ యాక్టివ్ మోడ్‌లో కనిపిస్తోంది. గత ఆరు నెలలుగా కాస్త స్తబ్ధుగా ఉన్న కేడర్‌ను ఎన్నికల టైంకి ఉత్సాహంతో పరుగులు పెట్టించే ప్లాన్‌తో టీడీపీ(TDP) ఉంది. ఆ ఆలోచనతో కీలకమైన నేతలంతా జనాల్లో ఉండేలా చూస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు(Chandra Babu) టూర్ ఖరారు అయింది. లోకేష్‌(Lokesh) కూడా నియోజకవర్గాలపై ఫోకస్ పెడుతున్నారు. ఇప్పుడు సీన్‌లోకి భువనేశ్వరి(Bhuvaneswari Nara) కూడా వచ్చారు. 


తొలిసారిగా రాజకీయాల్లోకి


అసలు చంద్రబాబు ఇంటి నుంచి లోకేష్‌ మినహా వేరే వాళ్లెవరూ రాజకీయాల్లో కానీ, ఇతర రాజకీయ కార్యక్రమాల్లో కనిపించే వాళ్లు కాదు. మొన్న చంద్రబాబు అరెస్టుతో తొలిసారిగా రాజకీయాల్లో ఆయన సతీమణి భువనేశ్వరి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. నేరుగా ప్రజల్లోకి వచ్చారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలే గుండె ఆగి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. నిజం గెలవాలి(Nijazm Gelavali) పేరుతో మొదటి విడత యాత్ర చేపట్టారు. 


రెండో విడత ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించాలని అప్పట్లో అనుకున్నారు. అయితే ఇంతలో చంద్రబాబు బెయిల్ రావడంతో ఆ యాత్ర అర్థాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని రీస్టార్ట్ చేయనున్నారు భువనేశ్వరి. చంద్రబాబు అరెస్టుతో గుండె ఆగి చనిపోయిన కుటుంబాలను పరామర్శించనున్నారు. వారికి మూడు రోజులు పాటు ఆమె పర్యటిస్తారు. ఈ యాత్ర రేపటి(బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. 


నిజం గెలవాలి పునః ప్రారంభం
మూడో తేదీన విజయనగరం జిల్లాలో భువనేశ్వరి పర్యటిస్తారు. నాలుగో తేదీన శ్రీకాకుళం జిల్లాలో టూర్ ఉంటుంది. ఐదున విశాఖ జిల్లాలో బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. 


చంద్రబాబు నియోజకవర్గాల టూర్


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఖరారు చేశారు. జనవరి 5 నుంచి 29వ తేదీ వరకు వరుసగా సభలు జరగనున్నాయి. 25 పార్లమెంట్ స్థానాల్లో 25 బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. ప్రతి బహిరంగసభకు లక్ష మంది ప్రజలు హాజరయ్యేలా పార్టీ సంసిద్ధమవుతోంది. జనవరి 5న ప్రకాశం జిల్లా కనిగిరిలో తొలి బహిరంగ సభ ఉంటుంది. జనవరి 7న ఆచంట, తిరువూరులో, 9న వెంకటగిరి, ఆళగడ్డ బహిరంగ సభలు జరగనున్నాయి. 10న పెద్దాపురం, టెక్కలిలో జరిగే బహిరంగసభల్లో చంద్రబాబు పాల్గొనున్నారు. 


గురువారం నుంచి జయహో బీసీ


జనవరి 4 నుంచి 'జయహో బీసీ' కార్యక్రమాన్ని కూడా టీడీపీ చేపడుతోంది. సీఎం జగన్ (CM Jagan) బీసీల ద్రోహి అని వైసీపీ హయాంలో బీసీలకు జరిగిన అన్యాయం చేశారని ఆరోపిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తమకు జరిగిన అన్యాయాలపై బీసీల్లో చైతన్యం కలిగేలా 2 నెలల పాటు 'జయహో బీసీ' (Jayaho BC) కార్యక్రమం కొనసాగించనుంది. తొలి విడతలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల్లో పర్యటిస్తారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. వచ్చే ఎన్నికల్లో బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టో కూడా రూపొందించనున్నారు. 


Also Read:కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనం - ముహూర్తం ఖరారు.?


Also Read:  ప్రయాణికులకు గుడ్ న్యూస్, సంక్రాంతికి మరిన్ని స్పెషల్ ట్రైన్స్: రైల్వే కీలక ప్రకటన