Chandra Babu Delhi Tour : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే రాష్ట్రానికి రావాల్సిన నిధులు కోసం ఇప్పటికే పలుమార్లు ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం ఆయన మరోసారి ఢిల్లీకి వెళ్ళనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఉండవల్లి నుంచి బయలుదేరి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకుంటారు.
శనివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. అదేరోజు రాత్రి కేంద్ర ఆర్థిక, జలవనురులశాఖ మంత్రితోపాటు మరికొంత మంది కేంద్రమంత్రులతోనూ సమావేశం కానన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. ప్రధానంగా అమరావతి నిర్మాణానికి నిధులు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన గతంలో ఇచ్చిన ప్రతిపాదనలను ఆమోదించడంతోపాటు నిధులు కేటాయింపు అంశాన్ని మరోసారి కేంద్ర ఆర్థిక, జల వనరులశాఖ మంత్రితో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించే అవకాశాలు ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీటితోపాటు రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా కేటాయించనున్న నిధులు, ఇటీవల జాతీయ రహదారుల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు తదితర కీలకమైన అంశాలను కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులతో భేటీ సందర్భంగా ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న కొన్ని పథకాలకు సంబంధించి రావాల్సిన నిధులు విషయాన్ని మంత్రుల దృష్టికి చంద్రబాబు నాయుడు తీసుకెళ్లనున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో శుక్రవారం, శనివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగే ముఖ్యమంత్రి కార్యక్రమాలను కూడా రద్దు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రాష్ట్రంలో నెలకొన్న అంశాలపైన చర్చకు అవకాశం..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాడులు పెరుగుతున్నాయి అంటూ జగన్మోహన్ రెడ్డి పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ వేదికగా ఆయన ఆందోళన కూడా చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు విషయాన్ని స్వయంగా చంద్రబాబునాయుడు వాస్తవాలను తెలియజేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయంగా మనుగడను తెలియజేసేందుకే ఈ తరహా ఆరోపణలు ఆయన చేస్తున్నట్లు వెల్లడించే అవకాశం ఉంది. అదే సమయంలో మరికొన్ని అంశాలపైన ఇరువురి మధ్య కీలక చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఉచిత ఇసుక పాలసీలో మరో ముందడగు- అందుబాటులోకి ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయం
బాబు వెంట కేంద్ర మంత్రులు, ఎంపీలు ఉండేలా ఆదేశాలు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఎంపీలు అందుబాటులో ఉండాలని ఇప్పటికే పార్టీ నుంచి సమాచారం అందింది. ఢిల్లీ పర్యటన ఆద్యంతం చంద్రబాబు నాయుడు వెంట కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తోపాటు కూటమి పార్టీకి చెందిన మిగిలిన 19 మంది ఎంపీలు అందుబాటులో ఉండాల్సిందిగా సమాచారం ఎంపీలకు వెళ్ళింది. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం రాత్రి గాని శనివారం ఉదయం గాని ఎంపీలు తోను ఆయన సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంపీలకు వివిధ శాఖలకు సంబంధించిన బాధ్యతలను చంద్రబాబు నాయుడు అప్పగించారు. ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులకు సంబంధించి కేంద్ర మంత్రులతో కలిసి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. వీటికి సంబంధించిన పురోగతిని ఎంపీలు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుసుకునే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రానికి వీలైనంత ఎక్కువగా నిధులు రాబట్టేందుకు కేంద్ర మంత్రులతోపాటు ఎంపీలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేయాలని ఈ సందర్భంగా ఆయన ఎంపీలకు సూచించే అవకాశం ఉంది.
Also Read: తెలుగురాష్ట్రాలకు మళ్లీ భారీ వర్ష సూచన, తెలంగాణలో ఐదురోజులపాటు దంచికొట్టనున్న వానలు