NDA not contested in MLC elections in Vizag | విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం అయ్యారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు అభ్యర్థిని నిలపలేదని తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేయకూడదని కూటమి పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. మరోవైపు స్వతంత్ర అభ్యర్థి షఫీ తన నామినేషన్ ఉపసంహరించుకున్నారని సమచారం. దాంతో విశాఖ లోకల్ బాడీ ఎమ్మెల్సీగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవమైంది. బొత్సను విజేతగా రిటర్నింగ్ అధికారి రెండు రోజుల్లో ప్రకటించనున్నారు.


విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆగస్టు 12న నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తమకు పూర్తి బలం ఉందని వైఎస్సార్ సీపీ మొదట్నుంచీ చెబుతూ వస్తోంది. ఓటు హక్కు వినియోగించుకోబోయే వారిలో వైసీపీ నేతలే ఎక్కువ మంది ఉన్నారు. దాంతో తమకు బలం ఉందని, అయినా కూటమి పార్టీలు అభ్యర్థులను నిలబెడితే పద్ధతి కాదని వైసీపీ నేతలు, ఆ పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ అన్నారు. తమకు స్పష్టమైన ఆధిక్యం ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం తమ పార్టీ అభ్యర్థిని పోటీలో నిలపాలని కుయుక్తులు పన్నుతోందని విమర్శించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ కు ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ వేసిన సమయంలో బొత్సతో పాటు ఆయన సతీమణి బొత్స ఝాన్సీ, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ మేయర్ గొలగాని హరి, వెంకట కుమారి కలసి పత్రాలు అందజేశారు. 


నామినేషన్ వేసిన తరువాత బొత్స మాట్లాడుతూ.. ‘విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న 840 ఓట్లలో 620 ఓట్లు YSRCP వే ఉన్నాయి. కూటమి పార్టీలకు కేవలం 200 ఓట్ల సంఖ్యా బలం మాత్రమే ఉంది. ఈ ఎన్నికల్లో నైతిక విజయం మాదే. మాకు బలం ఉంది, కనుక కూటమి పార్టీలు తమ అభ్యర్థిని బరిలో దింపితే అనైతికం అవుతుంది. మాకు మెజార్టీ ఉన్నప్పుడు కూటమి పార్టీలు అభ్యర్థిని ఎలా నిలబెడతాయి. వ్యాపారవేత్తల్ని తీసుకొచ్చి అభ్యర్థిగా నిలబెట్టడం సరికాదు. కూటమి పార్టీలు ఏం చేసినా సరే వైఎస్సార్ సీపీదే ఈ ఎన్నికల్లో విజయం. మా పార్టీ విజయం విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలతో మొదలవుతుందని’ వ్యాఖ్యానించారు.