ఆంధ్రప్రదేశ్‌లో ఇసుకను ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం దాన్ని మరింత పారదర్శకంగా ఇంటికి చేర్చేందుకు మరో విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది. బుధవారం గనుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్విహంచిన సీఎం చంద్రబాబు ఇందులో ఉన్న లోటుపాటు ఇతర సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇసుక బుకింగ్, ట్రాన్స్‌పోర్ట్, నిఘా వంటి అంశాలపై ఆరా తీశారు. దీనిపై కొన్ని సూచనలు చేశారు.
గ్రామవార్డు సచివాలయాల్లో ఇసుకను ఉచితంగా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అక్కడ బుకింగ్ చేసిన తర్వాత ఎప్పుడు రవాణా అవుతుంది అన్న విషయం నేరుగా వినియోగదారులకే తెలుస్తుందన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే ఇంటికి ఇసుకు చేరుతుందన్నారు.
ఇలా ఇసుకను ఆన్లైన్‌లో బుకింగ్ చేయడం వల్ల బుకింగ్ సులభతరం అవుతుందని, రీచ్‌ల వద్ద రద్దీ కూడా ఉండబోదన్నారు. ప్రజలకు ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ఇసుక రవాణా చేసే వాహనాలకు ఎంపానల్‌మెంట్ ఇవ్వనున్నట్టు చెప్పారు. అప్పుడు ప్రభుత్వం గుర్తించిన వెహికల్స్ మాత్రమే ఇసుక రవాణాకు అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. ఇక్కడ వినియోగదారుల వద్ద సొంత వెహికల్ ఉంటే కూడా ఇసుక తీసుకెళ్లవచ్చని అన్నారు.
ఇలా రవాణా చేసే సమయంలో జరిగే అక్రమాలు అరికట్టేందుకు ఎప్పటికప్పుడు థర్డ్ పార్టీ ఎంక్వయిరీ జరగాలని చంద్రబాబు సూచించారు. ఇలా చేస్తే పారదర్శకత వస్తుందని నిజమైన వియోగదారులకే ఇసుక చేరుతుందన్నారు. రవాణా రేట్లు కూడా అందుబాటులో ఉంటాయన్నారు.
ప్రైవేట్ వ్యక్తుల ఇసుకను బల్క్‌గా బుక్ చేసుకునేందుకు సపరేట్ ఆన్‌లైన్ విధానం తీసుకురావాలని అధికారులకు సూచించారు చంద్రబాబు. ఇలా బల్క్‌గా ఇసుక తీసుకెళ్లేవాళ్లు జీఎస్టీ, ప్రాజెక్టు వివరాలు, సైట్ వివరాలు అన్నీ ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సి ఉంటుందన్నారు. అలాంటి ప్రాజెక్టులను అధికారులు సందర్శించి వివరాలు నమోదు చేస్తారు. దీనికి అయ్యే ఖర్చంతా ఆ సంస్థలే భరించాల్సి ఉంటుంది.
ఉచితంగా ఇసుక రవాణా చేసే వాహనాలకు బ్యానర్లు పెట్టాలని, వాటికి ఆన్‌లైన్ ట్రాకర్ కూడా అమర్చాలన్నారు. నిఘా వ్యవస్థను జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీలు కలెక్టర్లు, ఎస్పీలతో మరింత పటిష్ట పరచాలన్నారు. ఇంకా సమస్యలు ఉంటే బాధితులు 1800-599-4599కి ఫోన్ చేసి లేదా ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు.