Weather Latest News: తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్షం(Heavy Rain) ముప్పు పొంచి ఉంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాగల ఐదు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్(Hyderabad) వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నేడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్ పరిసర జిల్లాలకు అధికారులు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
తెలంగాణలో వానలు దంచుడే(Telangana Weather Report)
తెలంగాణ(Telangana)లో రానున్న ఐదురోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్(Hyderabad) వాతావరణశాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్, రంగారెడ్డితోపాటు వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, సిద్దిపేట, భువనగిరి, సూర్యాపేట, సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి. రుతుపవన ద్రోణి ప్రభావం వల్లే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే అదును వర్షాలు పడటమేగాక...వరుణుడు దంచికొట్టడంతో తెలుగు రాష్ట్రాల్లో జలాశయాలన్నీ నిండిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి.
వాన వద్దురా దేవుడా అనేంతగా ఇటీవల వర్షాలు కురిశాయి. ఇప్పుడిప్పుడే కాస్త పొలం పనులు సాగుతున్నాయి అనుకుంటుండగా...ఇప్పుడు భారీ వర్ష సూచన రైతులను కలవరపెడుతోంది. ముఖ్యంగా పత్తి మంచి ఏపుగా పెరిగిన సమయంలో ఐదురోజుల పాటు వర్షం పడిందంటే పంట నీట మునిగి పూర్తిగా పాడైపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా అన్ని జలాశయాల కింద కాల్వలకు నీరు విడుదల చేయడంతో రైతులకు నీటితో పెద్దగా ఇబ్బంది లేదు. మంగళవారమే హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం దంచికొట్టింది. భారీ వర్షంతో రోడ్లన్నీ నిండిపోయాయి. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచి ట్రాఫిక్ జామ్ అయ్యింది. జూబ్లీహిల్స్,అమీర్‌పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, మాదాపూర్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
రాయలసీమకూ భారీ వర్ష సూచన(Andhra Pradesh Weather Report)
తెలంగాణతోపాటు ఏపీలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రుతుపవన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాయలసీమ(Rayalaseema) జిల్లాల వ్యాప్తంగా భారీగా వానలుపడనున్నాయి. కోస్తాలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు భారీగా వానలు పడే సూచన కనిపిస్తున్నాయని ఐఎండీ(IMD) హెచ్చరించింది.
దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతుంటుండటం వల్లే భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలోనూ ఒకటి, రెండుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
అధికారులు అప్రమత్తం
తెలుగురాష్ట్రాలకు మళ్లీ భారీ వర్ష సూచనల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా నదీపరివాహక ప్రాంత ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రమాదం ఉండటంతో అర్థరాత్రి ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. లంకల్లో ఉండే వారు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని హెచ్చరించారు. వరుస సెలవుల నేపథ్యంలో ప్రయాణాలు వంటివి పెట్టుకోవద్దని సూచించారు. రైతులు, కూలీలు సైతం పొలాలకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని...పిడుగులుపడే ప్రమాదం ఉన్న కారణంగా చెట్ల కింద నిల్చోవద్దని హెచ్చరించారు.
Also Read: ఉచిత ఇసుక పాలసీలో మరో ముందడగు- అందుబాటులోకి ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయం
Also Read: తెలంగాణలో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత, ఆదిలాబాద్, బెల్లంపల్లి లలో డేంజర్ బెల్స్