CAATSA Waiver For India: అమెరికా ప్రతినిధుల సభ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణులను కొన్నందుకు కాట్సా చట్టం కింద ఆంక్షలు విధించకుండా భారత్‌కు మినహాయింపు కలిగించే చట్ట సవరణ బిల్లును కాంగ్రెస్‌ దిగువ సభ ఆమోదించింది. భారత్‌- అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు రో ఖన్నా ఈ బిల్లును ప్రవేశపెట్టగా మూజువాణీ ఓటు ద్వారా బిల్లు గట్టెక్కింది.


అప్పటి నుంచి


రష్యా నుంచి ఐదు యూనిట్ల ఎస్‌-400 ఎయిర్‌ డిఫెన్స్‌ క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు 2018 అక్టోబరులో భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై అప్పటి అమెరికా ట్రంప్ సర్కారు హెచ్చరికలు చేసినా దేశ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా భారత్‌ వెనక్కి తగ్గలేదు. దీంతో భారత్‌పైనా కాట్సా ఆంక్షలు విధిస్తారని అందరూ అనుకున్నారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఈ ఏడాది ఏప్రిల్‌లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ తెలిపారు.


కాట్సా అంటే?


'కౌంటరింగ్‌ అమెరికా యాడ్వర్సరీస్‌ థ్రూ శాంక్షన్స్‌ యాక్ట్‌'ను సింపుల్‌గా కాట్సా అంటారు. తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఏదైనా దేశం ఇతర దేశాల నుంచి ఆయుధ సంపత్తిని సముపార్జించుకుంటే అగ్రరాజ్యం ఈ కాట్సాను ప్రయోగిస్తుంది. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే అమెరికా తన ప్రత్యర్థుల్ని నిరోధించే చట్టమే ఈ కాట్సా. 


అయితే, భారత్‌పై కాట్సా ఆంక్షలు విధించకుండా ఆ దేశానికి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అమెరికాలోని ప్రవాస భారత చట్టసభ ప్రతినిధుల నుంచి అభ్యర్థనలు వచ్చాయి. ఈ క్రమంలోనే భారత సంతతికి చెందిన కాంగ్రెస్‌ సభ్యుడు రో ఖన్నా ఇటీవల ఓ చట్ట సవరణను దిగువ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు దిగువ సభ ఆమోదం తెలిపింది. అయితే ఎగువ సభలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ తర్వాత అధ్యక్షుడి ఆమోదంతో భారత్‌కు ఈ చట్టం నుంచి మినహాయింపు లభిస్తుంది.


వారిపై


ఎస్‌-400ను కొనుగోలు చేసిన కారణంగా చైనా, టర్కీ (ఇది నాటో భాగస్వామి)లపై ఇప్పటికే కాట్సాను ప్రయోగించింది అమెరికా. మరి భారత్‌తో బలమైన మైత్రిని కాదని అమెరికా ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తుందా? లేక మరోసారి భారత్‌కు మినహాయింపు ఇస్తుందా అనేది అంశంపై ఇప్పటివరకు చర్చ నడిచింది. అయితే తాజాగా అమెరికా దిగువ సభ ఈ బిల్లుకు ఆమోదం తెలపడంతో భారత్‌తో మైత్రికే అమెరికా జై కొట్టినట్లు అర్థమవుతుంది.


ఎస్-400


ప్రపంచంలోకెల్లా అత్యంత అధునాతన గగనతల రక్షణ వ్యవస్థల్లో ఎస్‌-400 ట్రయంఫ్‌ ఒకటి. డ్రోన్లు, క్షిపణులు, రాకెట్లతో పాటు యుద్ధ విమానాల దాడుల నుంచి అది రక్షణ కల్పిస్తుంది. తనవైపు దూసుకొచ్చే శత్రు దేశాల ఆయుధాలను క్షిపణుల ప్రయోగంతో కూల్చివేస్తుంది. ప్రధానంగా చైనా, పాకిస్థాన్‌లతో పొంచి ఉన్న ముప్పు నుంచి రక్షణ ఛత్రంగా పని చేస్తుందన్న ఉద్దేశంతో భారత్‌ దీని కొనుగోలుకు నిర్ణయించింది. అయిదు ఎస్‌-400 వ్యవస్థల సముపార్జన కోసం 2018 అక్టోబరులో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది.


Also Read Warehouse Collapsed In Delhi: నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఐదుగురు మృతి


Also Read: Mohammed Zubair Gets Bail: జర్నలిస్ట్ మహ్మద్ జుబైర్‌కు రిలీఫ్- బెయిల్ మంజూరు