Mohammed Zubair Gets Bail: జర్నలిస్ట్, ఆల్ట్ న్యూస్ సహవ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్‌కు తాజాగా ఊరట లభించింది. ఒక వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ట్వీట్ చేసిన వ్యవహారంలో దిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
అయితే ఇందుకోసం రూ.50 వేలు వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. అలానే జుబైర్ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది పటియాలా హౌస్ కోర్టు.
ఇదీ కేసు
2018లో మహ్మద్ జుబైర్ చేసిన ట్వీట్ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందన్న కేసులో ఆయనను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ట్వీట్స్ చేశారంటూ జూన్ 27న జుబైర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సెక్షన్ 153, సెక్షన్ 295ఏ కింద ఆయనపై కేసు నమోదు చేశారు. అనంతరం పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు.
ఇటీవల నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను కూడా ముందుగా ట్వీట్ చేసింది జుబైర్‌నే. దీంతో ఆయన రెచ్చగొట్టే ట్వీట్స్ చేసినట్లు దిల్లీ పోలీసులు తమ ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. ప్రజల్లో ద్వేషభావాన్ని పెంచేలా జుబైర్ ట్వీట్లు ఉన్నట్లు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఐరాస స్పందన
జుబైర్ అరెస్ట్‌పై అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు వ్యక్తం అయ్యాయి. పాత్రికేయుల అరెస్టులపై ఐక్యరాజ్య సమితి (ఐరాస) స్పందించింది. పత్రికల్లో రాసే రాతలు, చేసే ట్వీట్లకు అనుగుణంగా పాత్రికేయులను అరెస్ట్ చేయడం సరైనది కాదని అభిప్రాయపడింది. ఈ మేరకు జుబైర్ అరెస్ట్ పై మీడియా అడిగిన ప్రశ్నకు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ సమాధానమిచ్చారు.
Also Read: Ranil Wickremesinghe: శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే ప్రమాణం