NGT Green Compensation: 


పిటిషన్ వేసిన మహిళ..తీర్పునిచ్చిన ఎన్‌జీటీ


నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అదానీ గ్రూప్‌కి షాక్ ఇచ్చింది. నెల్లూరులోని ముత్తుకూర్ మండల్‌లో అదానీ విల్మర్ లిమిటెడ్‌కు చెందిన వంటనూనె రిఫైనరీ యూనిట్‌...రూ.5 కోట్ల పర్యావరణ పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. పంటపాలెంలో ఉన్న ఈ యూనిట్‌,మితిమీరి భూగర్భ జలాలను తోడుకుంటోందన్న పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఎన్‌జీటీ ఈ ఆదేశాలిచ్చింది. నెల్లూరుకు చెందిన వేదవతి చెన్నైలోని ఎన్‌జీటీ సౌత్ బెంచ్‌లో పిటిషన్ వేశారు. పరిమితులు దాటి మరీ భూగర్భ జలాలు తోడుకోవటమే కాకుండా, స్థానిక ప్రజలకు నీటి వనరులు అందుబాటులో లేకుండా చేస్తున్నారని ఇందులో పేర్కొన్నారు. మొత్తం 5 యూనిట్లపై ఈ పిటిషన్ వేశారు. అందులో అదానీ గ్రూప్‌నకు చెందిన యూనిట్ కూడా ఉంది. వీటితో పాటు సరైవాలా ఏజీఆర్ఆర్ రిఫైనరీస్ లిమిటెడ్, లూయిస్ డ్రెఫస్ లాస్ట్ కమొడటీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థలూ గ్రౌండ్‌ వాటర్‌ విషయంలో నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని ఫిర్యాదు చేశారు వేదవతి. మిగతా ఆయిల్యూ నిట్లు కూడా రూ. 5 కోట్ల పరిహారం చెల్లించాలని ఎన్‌జీటీ స్పష్టం చేసింది. 


ఈ యూనిట్ల వల్ల ఆరోగ్యం దెబ్బ తింటోంది.. 


"ఈ యూనిట్లకు దరిదాపుల్లో ప్రజలు నివసించేందుకు వీల్లేకుండా ఉంది. నీటి వనరుల కొరతతో పాటు దుమ్ము, ధూళితో విపరీతమైనకాలుష్యం ఇబ్బందులు పెడుతోంది. వాయు కాలుష్యం వల్ల స్థానిక ప్రజల ఆరోగ్యం దెబ్బ తింటోంది" అని పిటిషన్‌లో పేర్కొన్నారు వేదవతి. ఆయిల్ రిఫైనరీ యూనిట్ల కారణంగా సాగు నీరు కూడా తీవ్రంగా కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు అనుగుణంగానే యూనిట్లు నడుపుతున్నామన్న కంపెనీల వాదనను ఖండించింది ఎన్‌జీటీ. ఆయిల్ పరిశ్రమల అభిప్రాయాలు, వాదనలు అన్నీ విన్నతరవాత ఎన్‌జీటీతో పాటు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ విధించిన నిబంధనల మేరకు నడుచుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆయిల్ రిఫైనరీ యూనిట్ల కారణంగా, వ్యవసాయం దెబ్బతింటోదన్న వాదననూ పరిశీలించిన ఎన్‌జీటీ, అందుకు పూర్తి ఆధారాలు లేనందున పరిహారం మొత్తాన్ని ఇంకా పెంచలేమని స్పష్టం చేసింది. 


ఆదేశాల మేరకు నడుచుకుంటాం: అదానీ కంపెనీ ప్రతినిధి


ఈ తీర్పుపై అదానీ విల్మర్ కంపెనీ ప్రతినిధి స్పందించారు. అంతకు ముందు ఈ యూనిట్ వేరే సంస్థ ఆధ్వర్యంలో నడిచిందని, 2018లో అదానీ గ్రూప్‌ చేతిలోకి వచ్చిందని గుర్తు చేశారు. అదానీ గ్రూప్ నిర్వహణ బాధ్యతలు చేపట్టకముందు జరిగిన నష్టానికి తమను నిందించంట సరికాదని అన్నారు. అయినా..ఎన్‌జీటీ ఆదేశాల మేరకు నడుచుకుంటామని వెల్లడించారు. 


Also Read: Tamarind Benefits: చింతపండు వంటలకు రుచి ఇవ్వడమే కాదు బోలెడు అనారోగ్య సమస్యలను దరి చేరనివ్వదు