దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, ఫిల్మ్ మేకర్ ప్రతాప్ పోతన్ మరణించారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. ఏదో ఒక్క పరిశ్రమకు మాత్రమే పరిమితం కాలేదు... తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమాల్లో ఆయన నటించారు.


ప్రతాప్ పోతన్ చెన్నైలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. ఈ రోజు ఉదయం ఫ్లాట్‌లో ఆయన విగత జీవుడై కనిపించారు. హార్ట్ అట్టాక్ వల్ల మృతి తుదిశ్వాస విడిచినట్టు సమాచారం అందుతోంది. 


ప్రతాప్ పోతన్ నటుడు మాత్రమే కాదు... దర్శకుడు, రచయిత, నిర్మాత. తెలుగులో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన 'చైతన్య' చిత్రానికి దర్శకత్వం వహించారు. దర్శకుడిగా తమిళ, మలయాళ భాషల్లో పది చిత్రాలు తీశారు. నటుడిగా ఎక్కువ మలయాళ, తమిళ చిత్రాలు చేశారు. 'మరో చరిత్ర'లో వరుణ్ సందేశ్ తండ్రిగా, సిద్ధార్థ్ 'చుక్కల్లో చంద్రుడు'లో ప్రకాష్ పాత్రలో, కమల్ హాసన్ 'ఆకలి రాజ్యం'లో ఓ పాత్రలో నటించారు. మలయాళ సినిమా 'సీబీఐ 5'లో చివరగా కనిపించారు. మరో మూడు మలయాళ చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయని సమాచారం. 


Also Read : అతడికి 56, ఆమెకు 46 - తాళి కట్టలేదు కానీ డేటింగ్‌లో లలిత్ మోడీ, సుష్మితా సేన్ జోడీ


నటి రాధిక, ప్రతాప్ పోతన్ 1985లో వివాహం చేసుకున్నారు. ఒక ఏడాది తర్వాత విడాకులు తీసుకున్నారు. వాళ్ళిద్దరికీ అదే తొలి వివాహం. ఆ రాధికతో విడాకుల తర్వాత అమలా సత్యనాథ్‌ను ప్రతాప్ పెళ్లి చేసుకున్నారు. 22 ఏళ్ళ వైవాహిక జీవితం అనంతరం 2012లో విడాకులు తీసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె. ఆమె పేరు కేయ. ప్రతాప్ పోతన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 


Also Read : 'గార్గి' రివ్యూ: ఎవరూ ఊహించని క్లైమాక్స్ - సాయి పల్లవి కొత్త సినిమా ఎలా ఉందంటే?