Nupur Sharma Remarks Row: అజ్మేర్ దర్గా వెలుపల జూన్ 17న వివాదాస్పదన వ్యాఖ్యలు చేసిన సయ్యద్ గౌహర్ చిస్తీని హైదరాబాద్‌లో గురువారం అరెస్ట్ చేశారు. అజ్మేర్ దర్గా ఖాదీమ్‌ (మతాధికారి)గా ఉన్న చిస్తీ ఈ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. మహ్మద్ ప్రవక్తపై భాజపా నుంచి సస్పెండైన నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చిస్తీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.




పోలీసుల వేట


అజ్మేర్ పోలీసులు గౌహర్ చిస్టీపై సుమోటోగా కేసు నమోదు చేసి అతని కోసం వేట ప్రారంభించారు. గురువారం ఉదయం హైదరాబాద్ బేగంబజార్ ప్రాంతంలో చిస్తీ ఉన్నారనే సమాచారంతో రాజస్థాన్‌కు చెందిన అజ్మేర్ పోలీసుల బృందం అక్కడికి చేరుకుంది. తెలంగాణ పోలీసుల సాయంతో చిస్తీని అరెస్టు చేశారు.


ఇదీ జరిగింది


నుపుర్ శర్మ వ్యాఖ్యల తర్వాత అజ్మేర్ దర్గాకు చెందిన పలువురు ఖాదీమ్‌లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చిస్తీ చేసిన వ్యాఖ్యలపై జూన్ 25న ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అజ్మేర్ అదనపు సూపరింటెండెంట్ వికాస్ సంగ్వాన్ తెలిపారు. జూన్ 29న చిస్తీ.. రాజస్థాన్‌ను వదిలి పారిపోయినట్లు వెల్లడించారు. చిస్తీ అరెస్ట్ కావడంతో ట్రాన్సిట్ రిమాండ్ ద్వారా అతడ్ని శుక్రవారం అజ్మేర్‌కు తీసుకువస్తామని ఆయన అన్నారు. ఐపీసీ 117, 143, 149, 188, 504, 506 సెక్షన్ల కింద చిస్తీపై కేసు నమోదు చేసినట్లు సంగ్వాన్ పేర్కొన్నారు.


మరొకరు


నుపుర్‌శర్మ తల నరికినవాళ్లకు తన ఇంటిని బహుమతిగా ఇస్తానన్న అజమేర్‌ దర్గా మత గురువును కూడా ఇటీవల రాజస్థాన్‌ పోలీసులు అరెస్టు చేశారు. దర్గా ఖాదిమ్ సల్మాన్ చిస్తీ ఈ మేరకు వీడియోలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. అతడికి ఇదివరకే నేరచరిత్ర ఉందని పోలీసులు తెలిపారు.


వ్యక్తిగతమైన ఆ వ్యాఖ్యలతో దర్గాకు సంబంధం లేదని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు అజమేర్‌ కార్యాలయ ప్రతినిధి దివాన్‌ జైనుల్‌ అబెదిన్‌ అలీ ఖాన్‌ తెలిపారు. మతసామరస్యానికి ప్రతీకగా ఉన్న దర్గా పీఠానికి ఆ వ్యాఖ్యలతో ఎటువంటి సంబంధం లేదన్నారు.


Also Read: Trump vs Elon Musk: 'మస్క్‌ను మోకాళ్లపై నిలబడి అడుక్కోమనాల్సింది' - ట్రంప్ కౌంటర్ మామూలుగా లేదు!


Also Read: Madras High Court: మంగళసూత్రం తీసేయడం మానసిక క్రూరత్వం- హైకోర్టు సంచలన వ్యాఖ్యలు