Hyderabad Accident: బంధువుల ఇంటికని కర్ణాటక నుంచి హైదరాబాద్ కు వచ్చారు. అలా భాగ్య నగర అందాలను చూసొద్దామని బండిపై బయలు దేరారు ఓ ఇద్దరు యువకులు. ఎలాంటి భయం లేకుండా అతి వేగంలతో వాహనాన్ని నడిపారు. అదే వారి పాలిట శాపంగా మారింది. వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వారు ఇక్కడ ప్రాణాలు కోల్పోయేలా చేసింది. అతివేగం అంత మంచిది కాదని ట్రాఫిక్ పోలీసులు ఎంతగా చెప్తున్నా వినరు. ఇలా ప్రాణాలు పోగొట్టుకొని వాళ్లని నమ్ముకొని బతుకుతున్న వాళ్లకు నరకం చూపిస్తారు. ఈ ఘటనలోనూ ఇదే జరిగింది. 


పాతికేళ్లు కూడా నిండకముందే గాల్లోకి ప్రాణాలు.. 


పంజాగుట్ట ఎస్సై ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటకకు చెందిన 23 ఏళ్ల మోహిన్, 22 సంవత్సరాల ఒబేద్ ఎర్రమంజిల్ నుంచి ఖైరతాబాద్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో సోమాజిగూడ హనుమాన్ దేవాలయం ఎదురుగా ఉన్న మెట్రో పిల్లర్ ను ఢీకొట్టారు. ఒక్కసారిగా కిందపడిపోయిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు విడచారు. అయితే విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.  


బంధువులు వస్తేనే పూర్తి వివరాలు..


అయితే మోహిన్, ఒబేద్ లు కర్ణాటక నుంచి హైదరాబాద్ లో ఉన్న బందువుల ఇంటికి వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుల బంధువులకు సమాచారం అందించామని.. వారు వస్తే తప్పు వీరికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియవని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే వీరి ప్రమాదానికి కారణం అని పోలీసులు గుర్తించారు. అతివేగం వద్దని ఎంత చెప్తున్నా చాలా మంది యువకులు వినకుండా వాళ్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని పోలీసులు వివరించారు. 


పిల్లల చేతికి బండిచ్చేటప్పుడే ఆలోచించండి..


చేతికి అందివచ్చిన పిల్లలు చనిపోతే.. ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో వర్ణించలేమని అన్నారు. పిల్లలకు బండి ఇచ్చేముందు తల్లిదండ్రులే గట్టిగా చెప్పాలని.. రోడ్డుపై నియమ, నిబంధనలు పాటిస్తేనే బండి ఇవ్వాలని వివరించారు. అలాంటప్పుడే ఇలాంటి ప్రమాదాలను అరికట్టగలమన్నారు. అంతే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్, సరైన పత్రాలు లేని వారికి ద్విచక్ర వాహనం ఇవ్వవద్దనని.. ఇవన్నీ ఉన్నా వారి తీరునే బట్టే బైకులు చేతికి ఇవ్వాలని చెప్పారు. మద్యం సేవించి ఉన్నప్పుడు కూడా వాహనాలను నడపనీయకూడదని స్పష్టం చేశారు. అప్పుడే మీ బిడ్డలను మీరు కాపాడుకోగల్గుతారని.. రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గించగల్గుతారని పోలీసులు వివరించారు.