ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ ఐరోపా పార్లమెంటులో వర్చువల్ వేదికగా ప్రసంగించారు. రష్యా తమపై ఎన్ని దాడులు చేసినా ఉక్రెయిన్ వెనక్కి తగ్గేదేలేదని జెలెన్‌స్కీ తేల్చిచెప్పారు.
జెలెన్‌స్కీ ప్రసంగం పూర్తయిన తర్వాత పార్లమెంటు సభ్యులంతా లేచి నిలబడి నిమిషం పాటు కరతాళధ్వనులతో తమ మద్దతును తెలిపారు. ఉక్రెయిన్‌కు అండగా ఐరోపా మొత్తం ఉందని వారు అన్నారు. రష్యా యుద్ధం చేస్తున్నది కేవలం ఉక్రెయిన్‌పై కాదని యావత్ ఐరోపాపైనని సభ్యులు అన్నారు. రష్యాను ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతీస్తామన్నారు.
బ్రిటన్ హెచ్చరిక
మరోవైపు రష్యాపై ఐరోపా దేశాలు ఆంక్షలను మరింత పెంచుతున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్‌లోని ఆయన కమాండర్‌లు యుద్ధ నేరాలకు సంబంధించిన అభియోగాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హెచ్చరించారు.
రష్యా దారికి రానంత వరకు ఆంక్షలు కొనసాగుతాయన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా దాడి అనాగరికమన్నారు. తమను తాము రక్షించుకోవాలనే ఉక్రెయిన్ ప్రజల ఆకాంక్షను, ఐరోపా దేశాల ఐక్యతను రష్యా తక్కువ అంచనా వేసిందన్నారు.
Also Read: Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో భారత విద్యార్థి మృతి- భారత విదేశాంగ శాఖ ప్రకటన
Also Read: Ukraine Russia War: ఈయూ దేశాలపై పుతిన్ ప్రతీకారం- రష్యా గగనతలంలోకి ఆ దేశ విమానాలు వస్తే!