Aung San Suu Kyi Corruption Case: మయన్మార్ హక్కుల కార్యకర్త, నోబెల్ పురస్కార గ్రహీత ఆంగ్‌ సాన్‌ సూకీకి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఆ దేశ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మయన్మార్ సైనిక ప్రభుత్వం సూకిపై 11 అవినీతి కేసులు మోపింది. ఇందులో ఓ కేసులో తీర్పు వెలువరించింది.






అవినీతి కేసులో


ప్రస్తుతం మయన్మార్‌లో సైనిక ప్రభుత్వం కొనసాగుతోంది. సూకిపై 11 అవినీతి కేసులను సైనిక ప్రభుత్వం మోపింది. ఈ కేసు విచారణలో భాగంగా బుధవారం జుంటా కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. 6 లక్షల డాలర్ల నగదు, 11.4 కిలోల బంగారాన్ని సూకీ లంచం రూపంలో తీసుకున్నట్టు కోర్టు పేర్కొంది. దీంతో సూకీకి ఐదేళ్లపాటు జైలు శిక్షను విధిస్తున్నట్టు కోర్టు తీర్పునిచ్చింది.


అయితే, సైనిక ప్రభుత్వం మోపిన 11 కేసుల్లో ఇది మొదటి కేసు మాత్రమే. మిగిలిన 10 కేసుల్లో కూడా ఆమెపై ఉన్న ఆరోపణలు నిరూపితమైతే మరింత శిక్షపడే అవకాశం ఉంది. 


ఎన్నికల్లో గెలిచినా


2020 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో సూకీ పార్టీ నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డీ) హౌస్‌ ఆఫ్‌ నేషనాలిటీస్‌లో 138 సీట్లు సాధించింది. ప్రతినిధుల సభలో 258 సీట్లు గెల్చుకుంది. సైన్యం మద్దతున్న యూనియన్‌ సాలిడారిటీ డెవలప్‌మెంట్‌ పార్టీ (యూఎస్‌డీపీ) దారుణంగా ఓడిపోయింది. రెండు సభల్లో వరుసగా కేవలం 7, 26 సీట్లు మాత్రమే సంపాదించుకోగలిగింది. అప్పట్నుంచి రాజ్యాంగ సవరణలపై సూకీ బృందం ఆలోచించటం మొదలెట్టింది. ఈ చర్యలను సైన్యం వ్యతిరేకిస్తూ వచ్చింది. కొత్త పార్లమెంటు సమావేశమై నిర్ణయాలు తీసుకోకుండా తిరుగుబాటు ద్వారా సూకీకి, రాజ్యాంగ సవరణలకు సైన్యం కళ్లెం వేసింది. అనంతరం దేశాన్ని హస్తగతం చేసుకొని సూకీని జైల్లో పెట్టింది.


ప్రజానేత ఆంగ్‌ సాన్‌ సూకీ 1989 నుంచి 2010 మధ్య 15 ఏళ్ల పాటు గృహ నిర్బంధంలో ఉన్నారు. ఆమె మయన్మార్‌లో సైనిక పాలన నిర్మూలన కోసం పోరాటం చేశారు. ఆంగ్ సాన్ సూకీకి 1991లో నోబెల్‌ శాంతి బహుమతి లభించింది.


Also Read: Covid Update: కరోనా పరిస్థితులపై కీలక సమీక్ష- సీఎంలతో ప్రధాని మోదీ భేటీ


Also Read: PM MOdi On Petrol Prices : పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించండి - సీఎంలకు ప్రధాని సూచన !