Donald Trump on Vladimir Putin: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తానే కనుక ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడైతే పుతిన్‌కు తడాఖా చూపించి ఉండేవాడినని ట్రంప్ అన్నారు. పియర్స్ మోర్గాన్ అన్‌సెన్సార్డ్ పేరిట జరిగిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
క్రెమ్లిన్ నేత (పుతిన్‌ను ఉద్దేశించి).. పదే పదే అణు అనే పదం ఉపయోగిస్తున్నారు. నేనే గనుక అధ్యక్ష స్థానంలో ఉండి ఉంటే.. ఆ పదం వాడొద్దంటూ గట్టిగా హెచ్చరించేవాడిని. పుతిన్ ప్రతీరోజూ ఆ పదం వాడుతూనే ఉన్నారు. అంతా భయపడుతున్నారు. ఆ భయాన్ని చూసి ఇంకా పదే పదే ఆ పదాన్నే రిపీట్ చేస్తున్నారు. ఆ భయమే అతనికి ఆయుధంగా మారుతోంది. కానీ, అమెరికా దగ్గర అంతకంటే ఎక్కువే ఆయుధ సంపత్తి ఉంది. మీ కంటే మేం శక్తివంతమైన వాళ్లం. అది తెలుసుకో అని పుతిన్‌తో గట్టిగా చెప్పేవాడిని. ఒకవేళ నేనే గనుక అధ్యక్షుడిని అయ్యి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదని గట్టిగా హెచ్చరించేవాడిని, నా తడఖా చూపించేవాడిని. - డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు
అంతకుముందు
ఉక్రెయిన్‌పై దండయాత్రకు పుతిన్ చేపడతోన్న చర్యలను జీనియస్‌గా ట్రంప్ ఇటీవల పేర్కొన్నారు. పుతిన్‌పై ప్రశంసలు కురిపించారు. అయితే అమెరికా అధ్యక్షుడిగా తాను ఉంటే పరిస్థితులు ఇలా ఉండేవి కావన్నారు.
తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్రత కల్పిస్తూ పుతిన్ నిర్ణయం తీసుకోవడంపై ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో ఇలా స్పందించారు.
" పుతిన్ ఈ ప్రకటన చేసినప్పుడు నేను టీవీలో చూసి 'జీనియస్' చర్యగా పేర్కొన్నాను. ఉక్రెయిన్‌లోని అతిపెద్ద ప్రాంతాలకు స్వతంత్రత కల్పిస్తూ పుతిన్ నిర్ణయం తీసుకున్నారు. ఇది అద్భుతం. ఇది ఓ తెలివైన చర్య. వ్లాదిమిర్ పుతిన్ గురించి నాకు బాగా తెలుసు. కానీ ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే పుతిన్ ఇలా సాహసం చేసి ఉండేవారు కాదు. రష్యా- ఉక్రెయిన్ మధ్య ప్రస్తుత పరిస్థితులను బైడెన్ సరిగా హ్యాండిల్ చేయలేకపోతున్నారు.
"
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు