పెట్రోల్, డిజిల్ ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణం అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆరోపించారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించడం లేదని అందుకే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయన్నారు. గత ఏడాది నవంబర్‌లో ఎక్సైజ్ ట్యాక్స్‌ను కేంద్రం తగ్గించినా ఇతర రాష్ట్రాలు తగ్గించలేదన్నారు. ముఖ్యమంత్రులతో కరోనా పరిస్థితులపై మోదీ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర, బెంగాల్, తమిళనాడు, ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలువ్యాట్‌ను తగ్గిస్తే ప్రజలపై భారం తగ్గుతుందన్నారు. సమావేశంలోనే రాష్ట్రాలను పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించాలని మోడీ విజ్ఞప్తి చేశారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి చేస్తేనే ధరలు తగ్గుతాయన్నారు. 


రథోత్సవంలో అపశ్రుతిపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం


దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు అమాంతం పెరుగుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా భారతీయులపై పెట్రో బాంబ్ పడుతోంది. ప్రస్తుతం దేశంలో పెట్రోల్ లీటర్ ధర రూ. 120 దాటిపోయింది. డీజిల్ ధర కూడా 110 దగ్గరగా ఉంది. అయితే ఈ ధరలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాస్త తక్కువగా ఉన్నాయి. గత ఏడాది నవంబర్‌లో దీపావిళి సందర్భంగా లీటర్‌పై రూ. పది తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలు తమ వంతుగా మరికొంత తగ్గించాయి. కానీ బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు మాత్రం తగ్గించలేదు. దీంతో ఆయా రాష్ట్రాల్లో అత్యధిక రేట్లు ఉన్నాయి. 


కాంగ్రెస్‌కు హ్యాండ్ ఇచ్చిన పీకే- కానీ ఆ ట్వీట్‌లో మాత్రం ఏదో పంచ్ ఉందేె!


కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనూహ్యంగా క్రూడాయిల్ ధరలు తగ్గిపోయాయి. అయితే కేంద్రం ధరలు తగ్గించలేదు. ఎక్సైజ్ డ్యూటీ భారీగా పెంచుకుంటూ పోయారు. ఎక్సైజ్ డ్యూటీ శాతంతో కంపేర్ చేసుకుని రాష్ట్రాలు వ్యాట్ విధిస్తున్నాయి. అటు కేంద్ర పన్నులు.. ఇటు రాష్ట్ర పన్నులు కలిసి పెట్రో భారం పెరిగిపోతోంది. లీటర్ పెట్రోల్‌లో రూ. 70కిపైగానే కేంద్ర, రాష్ట్రాల పన్నులు ఉంటున్నాయి. ప్రజలకు ఇది పెను భారంగా మారింది. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతోంది. అయినాప్రభుత్వాలు ఆదాయం తగ్గిపోతోందన్న కారణంగా ధరలు తగ్గించడానికి ఏ మాత్రం సిద్దంగా లేవు. ఇప్పుడు ప్రధాని మోదీ నేరుగా ముఖ్యమంత్రులకే విజ్ఞప్తి చేశారు. మరి ఏమైనా తగ్గిస్తారో లేదో వేచి చూడాలి .