ఆగస్టు 31 వరకు గడువు విధిస్తూ అల్టిమేటం జారీ చేశారు. అయితే గడువు దగ్గర పడుతుండగా, అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు ఎలా మారబోతున్నాయనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా నిఘా విభాగం సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, తాలిబన్ నేతల మధ్య రహస్య సమావేశం జరిగిందని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు పలు జాతీయ, అంతర్జాతీయ మీడియాలు రిపోర్ట్ చేశాయి. మరోవైపు అమెరికాకు తాలిబన్లు మరో వార్నింగ్ ఇచ్చారు.


అఫ్గాన్‌ నుంచి విదేశీయులతో పాటు ఆ దేశ పౌరులు సైతం శరణార్థులుగా వెళ్లిపోతున్నారు. అమెరికా బలగాలు వీరికి సహాయ సహకారాలు అందించి, అఫ్గాన్ నుంచి సురక్షితంగా విదేశాలకు తరలిస్తున్నాయి. కాబుల్ ఎయిర్‌పోర్టును అమెరికా బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇదివరకే పలు దేశాలు తమ దౌత్య కార్యాలయాలను అఫ్గాన్‌లో మూసివేయడం తెలిసిందే. అయితే తమ దేశంలో బలగాలను వెనక్కి రప్పించినప్పటికీ.. అమెరికా మాత్రం పౌరులకు సహాయం చేస్తూ విదేశాలకు తరలించడంపై తాలిబన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నైపుణ్యం ఉన్న వారి అవసరం అఫ్గాన్‌కు ఉందని, అయితే అమెరికా వారిని ఇతర దేశాలకు తరలిస్తుందని ఆరోపించింది. తక్షణమే ఈ చర్యలను మానుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
Also Read: Afghanistan News: తాలిబన్ల చెర నుంచి ఒక్కరోజులో 10 వేల మందిని కాపాడిన అమెరికా సైన్యం.. వైట్ హౌస్ ప్రకటన






తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మీడియాతో మాట్లాడుతూ.. అఫ్గాన్ నుంచి నైపుణ్యం, ప్రతిభ ఉన్న వారిని మాత్రం విదేశాలకు తరలించవద్దని అమెరికాకు సూచించాం. కానీ అమెరికా తమ మాటల్ని పెడచెవిన పెట్టిందన్నారు. మరోవైపు పంజ్‌షీర్ లోయ ప్రాంతంలో తిరుగుబాటుతో తాలిబన్ నేతలు కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న మేధావులను విదేశాలకు తరలి వెళ్లకుండా చర్యలకు ఉపక్రమించింది. ఆగస్టు 31వ తేదీనే తుది గడువు అని, అప్పటిలోగా అమెరికా మొత్తం బలగాలు అఫ్గాన్‌ను వీడాలని లేకపోతే దాడులకు తెగబడతామని హెచ్చరించారు.


అమెరికాకు ఇచ్చిన డెడ్‌లైన్‌ను పొడిగించే ప్రసక్తే లేదని తాలిబన్ ప్రతినిధి స్పష్టం చేశారు. దేశంలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తున్నాయని.. అయితే ఎయిర్ పోర్టులో పరిస్థితి అదుపులోకి రావడం లేదన్నారు. అఫ్గాన్‌కు చెందిన మేధావులు, నిపుణులు సైతం దేశాన్ని వీడటం వల్ల నష్టం చేకూరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు తాలిబన్ నేతలు, సీఐఏ ప్రతినిధులకు మధ్య జరిగిన రహస్య భేటీ గురించి తనకు తెలియదన్నారు.
Also Read: Afghanistan Taliban Crisis: 'డెడ్ లైన్'కు ముందు రహస్య భేటీ.. తాలిబన్ అగ్రనేతతో యూఎస్ చర్చ