అఫ్గానిస్థాన్ లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఆగస్టు 31 గడువు దగ్గర పడుతున్న వేళ అఫ్గాన్ లో ఏం జరుగుతుందోనని ప్రపంచం మొత్తం చూస్తోంది. ఈ నెలాఖరులోపు అమెరికా దళాలు అఫ్గాన్ ను విడిచి వెళ్లాలని ఇప్పటికే తాలిబన్లు అల్టిమేటం జారీ చేశారు. అయితే తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది.


రహస్య భేటీ..


అమెరికా నిఘా విభాగం సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(CIA), తాలిబన్ల మధ్య రహస్య సమావేశం జరిగిందట. అఫ్గాన్ కు కాబోయే అధ్యక్షుడిగా పేర్కొంటున్న తాలిబన్ నేత అబ్దుల్ ఘనీ బరాదర్ తో సీఐఏ డైరెక్టర్ విలియమ్ జే బర్న్స్​ భేటీ అయినట్లు సమాచారం. కాబుల్ వేదికగా సోమవారం ఈ సమావేశం జరిగినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రచురించింది. ఈ విషయాలను అమెరికా అధికారులే వెల్లడించారని తెలిపింది.


అఫ్గాన్​ను ఆక్రమించుకున్న తర్వాత అమెరికా, తాలిబన్ల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని, ఈ నేపథ్యంలో సమావేశం జరిగిందని వార్తా సంస్థ పేర్కొంది. అఫ్గాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణకు ఆగస్టు 31 వరకు గడువు ఉంది. అయితే దీన్ని పొడిగించే అంశంపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయంపై స్పందించేందుకు సీఐఏ నిరాకరించింది.


స్పీడు పెంచిన అమెరికా..


అమెరికా తమ బలగాల తరలింపు ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. అఫ్గాన్ రాజధాని కాబూల్ నుంచి నిన్న ఒక్కరోజే 10,900 మందిని సురక్షితంగా తరలించామని స్పష్టం చేసింది. 15 అమెరికా యుద్ధ విమనాలలో 6,600 మంది తరలించగా.. మరికొన్ని సంస్థలు, దేశాల సహకారంతో మరో 4,300 మందిని అఫ్గాన్ నుంచి విదేశాలలో సురక్షిత ప్రాంతాలకు తరలించామని వైట్ హౌస్ అధికారులు తెలిపారు.






 


మిగిలిన దేశాలు కూడా తమ పౌరుల తరలింపు ప్రక్రియను స్పీడుగా చేస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ కు చెందిన ఓ విమానం హైజాక్ అయినట్లు నేడు వార్తలు రావడం కలకలం రేపింది. తమ విమానాన్ని గుర్తు తెలియని వ్యక్తులు హైజాక్ చేసి ఇరాన్ తీసుకువెళ్లిపోయినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఈ వార్తల నేపథ్యంలో మిగిలిన దేశాలు మరింత అప్రమత్తమయ్యాయి.


Also Read: Ukrainian plane Hijacked: అఫ్గానిస్థాన్ లో ఉక్రెయిన్ విమానం హైజాక్