అఫ్గానిస్థాన్ లో ఉక్రెయిన్ విమానం హైజాక్‌కు గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆయుధాలతో వచ్చి ఈ విమానాన్ని కాబుల్ ఎయిర్‌పోర్టు నుంచి ఇరాన్ తీసుకెళ్లినట్లు ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి యెవ్‌జెనీ యెనిన్ వెల్లడించారు.
ఇప్పటికే అఫ్గానిస్థాన్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. తాలిబన్లు ఆక్రమించిన తర్వాత అక్కడి పౌరులు దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తాలిబన్లు మహిళలతో దారుణంగా వ్యవహరిస్తున్నారు.
కొనసాగుతున్న తరలింపు..
ప్రస్తుతం అఫ్గాన్ నుంచి తమ పౌరుల తరలింపు ప్రక్రియలో వివిధ దేశాలు నిమగ్నమయ్యాయి. తమ పౌరులు, బలగాల తరలింపునకు ఆగస్టు 31 తుది గడువుగా అమెరికా ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ లోపు మొత్తం తరలింపు పూర్తి కాకపోవచ్చని ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై తాలిబన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 31 తర్వాత అమెరికా బలగాలు అఫ్గాన్ లో ఉంటే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవలసి ఉంటుంది హెచ్చరించారు. ఇప్పుడు అందరి దృష్టి ఆగస్టు 31 పైనే ఉంది.