ABP  WhatsApp

Tamil Nadu Waqf Board: ఆ ఆలయం సహా గ్రామం మొత్తం మాదే: వక్ఫ్ బోర్డు సంచలన ప్రకటన

ABP Desam Updated at: 15 Sep 2022 04:34 PM (IST)
Edited By: Murali Krishna

Tamil Nadu Waqf Board: తమిళనాడులోని ఓ ఊరంతా తమదేనని తమిళనాడు వక్ఫ్ బోర్డు ప్రకటించుకోవడం సంచలనంగా మారింది.

(Image Source: Wiki)

NEXT PREV

Tamil Nadu Waqf Board: హిజాబ్, జ్ఞానవాపి మసీదు కేసు నడుస్తుండగా తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. ఏకంగా ఓ ఊరు మొత్తాన్ని తమ ఆస్తిగా ప్రకటించుకుంది రాష్ట్ర వక్ఫ్ బోర్డు. ఈ విషయం తెలిసిన ఆ గ్రామస్థులు అవాక్కయ్యారు. 


ఇదీ సంగతి


తమిళనాడులోని తిరుచెందురైలో ఉన్న ఆలయం సహా యావత్ గ్రామాన్ని తమ ఆస్తిగా ప్రకటించుకుంది ఆ రాష్ట్ర వక్ఫ్ బోర్డు. ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన కుమార్తె పెళ్లి కోసం తన వ్యవసాయ భూమిని అమ్మేందుకు ప్రయత్నించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.


తన 1.2 ఎకరాల భూమి తమిళనాడు వక్ఫ్ బోర్డుకు చెందినదని.. దానిని విక్రయించాలనుకుంటే బోర్డు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌ఓసి) పొందాలని రాజగోపాల్‌కు సబ్‌రిజిస్టార్ ఆఫీసు సూచించింది. అంతేకాకుండా ఆ ఊరు మొత్తం తమ ఆస్తిగా తమిళనాడు వక్ఫ్‌ బోర్డు క్లెయిమ్ చేసిన 20 పేజీల లేఖను చూపించింది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం. ఇది చూసి కంగుతిన్న రాజగోపాల్.. తన ఆస్తి పత్రాలను పరిశీలించాడు. కానీ అందులో ఎక్కడా అలాంటి వివరాలు లేవు.


తిరుచెందురై గ్రామంలోని భూమి అంతా వక్ఫ్ బోర్డుకు చెందినదని, ఎవరైనా భూమిని విక్రయించాలనుకుంటే చెన్నైలోని బోర్డు నుంచి ఎన్‌ఓసీ పొందాలని ఓ అధికారి తెలియజేశారు.


వేల ఎకరాలు


రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ బోర్డుకు కొన్ని వేల ఎకరాల భూమి ఉంది. ముఖ్యంగా ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న 18 గ్రామాలు వక్ఫ్ బోర్జు పేరిట ఉన్నాయి. అయితే గ్రామస్థులు మాత్రం అధికారులు చెప్పే మాటల్లో నిజం లేదని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.



గ్రామంలో ముస్లింలు ఆస్తిని కొనుగోలు చేశారనే ఎలాంటి సమాచారం లేదు. 1927-1928లో ఆస్తులు రీసెటిల్‌మెంట్ జరిగినట్లు పత్రాలు సూచిస్తున్నాయి. 1500 ఏళ్లనాటి సుందరేశ్వర ఆలయానికి 369 ఎకరాల ఆస్తి ఉంది. ఇది కచ్చితంగా ముస్లింలకు చెందిన భూమి కాదు. ఇది నిరూపించడానికి మా దగ్గర సంబంధిత పత్రాలు ఉన్నాయి.                    -  దనపాల్, పంచాయతీ మాజీ ప్రెసిడెంట్


తనకున్న భూమిలో వ్యవసాయం చేయలేక తీవ్రంగా నష్టపోయానని అందుకే ల్యాండ్‌ను అమ్మేందుకు సిద్ధమైనట్లు రాజగోపాల్ తెలిపాడు. 1992లో సదరు భూమిని కొనుగోలు చేసినప్పుడు సక్రమంగానే రిజిస్ట్రేషన్ చేయించినట్లు చెప్పుకొచ్చాడు. 


అయితే తిరుచ్చిలోని 12 రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పంపిన 20 పేజీల లేఖలో అనేక జిల్లాల్లోని భూములు తమవేనని వక్ఫ్ బోర్డు పేర్కొంది.


ఆ భూమి మాదే


ఈ వ్యవహారం గురించి తమిళనాడు వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ రెహమాన్‌ స్పందించారు. ఆ ఊరిలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ బోర్డుకు వందల ఎకరాల భూములు ఉన్నట్లు చెప్పారు.



ఈ ఆస్తులు అనేక వక్ఫ్ సంస్థల పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. అయితే ఈ భూమిని ప్రజలు స్వచ్ఛందంగా ఉపయోగించుకోవడానికి వక్ఫ్ బోర్డు అనుమతించింది. అయితే, వివిధ ప్రదేశాలలో ఆక్రమణలు జరిగాయి. ఆ ఆక్రమణలను నిలిపివేయడానికి తమిళనాడు వక్ఫ్ బోర్డు అధికారికంగా అన్ని సర్వే నంబర్లను సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఇచ్చింది. తిరుచ్చి జిల్లాలోని తిరుచెందురై వంటి కొన్ని గ్రామాల్లో చాలా వరకు ప్రైవేట్ లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. చాలా మంది స్థానికులు వక్ఫ్‌కు చెందిన ఆస్తులలో నివసిస్తున్నారు. కానీ వాళ్లు ఆ ఆస్తులను ఎవరికీ అమ్మలేరు, కొనలేరు. అక్కడ మాకు 389 ఎకరాల భూమి ఉంది. మేం అన్ని వివరాలను అందించాం. అవి ప్రభుత్వ ఆర్కైవ్స్ విభాగంలో కూడా అందుబాటులో ఉన్నాయి. - అబ్దుల్ రెహమాన్‌, తమిళనాడు వక్ఫ్ బోర్డు ఛైర్మన్  


మతం వాడొద్దు



వక్ఫ్ ఆస్తులు.. ప్రజల సంక్షేమం కోసం ఉన్నాయి. కానీ కొంతమంది గ్రామస్థులు.. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజలకు మంచి జరిగే వ్యవహారాల్లో మతం ముసుగు తేవడం చాలా దురదృష్టకరం.            -   అబ్దుల్ రెహమాన్‌, తమిళనాడు వక్ఫ్ బోర్డు ఛైర్మన్


Also Read: Lakhimpur Kheri Case: 'వెన్నులో వణుకు పుట్టిస్తాం'- గ్యాంగ్ రేప్‌పై యోగి సర్కార్ సీరియస్



 

Published at: 15 Sep 2022 04:22 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.