Bar Council Of India: న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంచాలని నిర్ణయించింది. అలానే సుప్రీం కోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 67 ఏళ్లకు పెంచాలని.. ఇందుకోసం తక్షణమే రాజ్యాంగ సవరణ చేయాలని తీర్మానం చేసింది.
ఏకగ్రీవం
ఈ మేరకు అన్ని రాష్ట్ర బార్ కౌన్సిల్‌లు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంయుక్త సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసింది. వయో పరిమితి పెంపు తీర్మానానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది.
అనుభవజ్ఞులైన న్యాయవాదులను వివిధ కమిషన్లు, ఇతర ఫోరమ్‌లకు ఛైర్మన్‌లుగా నియమించేలా వివిధ చట్టాలను సవరించాలని కూడా బార్ కౌన్సిల్ తీర్మానం చేసింది. ఈ తీర్మానంపై తక్షణం చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది.
ఈ తీర్మాన కాపీని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు పంపాలని నిర్ణయించింది. ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లు ఉండగా, సుప్రీంకోర్టు జడ్జిల పదవీ విరమణ వయసు 65 ఏళ్లుగా ఉంది.
గతంలో
తొలి నాళ్లలో హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లుగా ఉండేది. 1963 అక్టోబర్ నుంచి 62 ఏళ్లకు పెంచారు. ఈ వయసును 65 ఏళ్లకు పెంచే ఉద్దేశంతో 2010 ఆగస్టు 25న లోక్‌సభలో 115వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే, ఆ బిల్లు పాస్ కాలేదు. ఆలోపు 15వ లోక్‌సభ పదవీ కాలం ముగిసిపోయింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ కూడా జడ్జీల పదవీ విరమణ వయసును పెంచాలని అభిప్రాయపడ్డారు. ఎవరైనా రిటైర్ అవడానికి 65 ఏళ్లు చాలా చిన్న వయసు అని తాను అనుకుంటున్నట్లు జస్టిస్ ఎన్‌వీ రమణ తెలిపారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కూడా పలుమార్లు న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయసు పెంపును సమర్థించారు.
Also Read: Goa Congress BJP: దేవుడు శాసించాడు- నేను పాటించాను, అందుకే పార్టీ మారాను: మాజీ సీఎం
Also Read: Lakhimpur Horror: లఖింపుర్ కేసులో షాకింగ్ విషయాలు- బాలికలపై గ్యాంగ్ రేప్, ఆపై హత్య!