ABP  WhatsApp

Goa Congress BJP: దేవుడు శాసించాడు- నేను పాటించాను, అందుకే పార్టీ మారాను: మాజీ సీఎం

ABP Desam Updated at: 15 Sep 2022 12:02 PM (IST)
Edited By: Murali Krishna

Goa Congress BJP: దేవుడు చెప్పినందుకే తాము పార్టీ మారామని గోవా మాజీ సీఎం దిగంబర్ కామత్ అన్నారు.

(Image Source: PTI, Getty)

NEXT PREV

Goa Congress BJP: పార్టీకి విధేయంగా ఉంటామని దేవాలయాలు, చర్చిలు, మసీదుల వద్ద ప్రతిజ్ఞ చేసిన ఏడు నెలలకే గోవాలోని 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎనిమిది మంది అధికార భాజపాలోకి జంప్ అయ్యారు. ఎన్నికల తర్వాత తాము పార్టీ మారబోమని రాహుల్ గాంధీ సమక్షంలో కూడా వీళ్లు ప్రమాణం చేశారు.


ఆ ప్రమాణాలు, ప్రతిజ్ఞలు ఏమైపోయాయని మీడియా అడిగిన ప్రశ్నకు గోవా మాజీ సీఎం, పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహించిన దిగంబర్ కామత్ దిమ్మతిరిగి పోయే సమాధానం ఇచ్చారు.


తాను, మిగిలిన ఎమ్మెల్యేలు భాజపాలో చేరే ముందు దేవుడి అనుమతి తీసుకున్నామని.. అందుకు "దేవుడు అంగీకరించాడు" అని కామత్ అన్నారు. 







నేను దేవుడిని నమ్ముతాను. ఎన్నికల ముందు మేము కాంగ్రెస్‌ను వీడబోమని ప్రమాణం చేసిన మాట వాస్తవమే. అయితే భాజపాలో చేరే ముందు మళ్లీ గుడికి వెళ్లి నేను ఏం చేయాలి అని దేవుళ్లను, దేవతలను అడిగాను.  మీరు ముందుకు సాగండి, చింతించకండి అని దేవుడు అన్నాడు. మీకు ఏది మంచి అయితే అది చేయమని దేవుడు చెప్పాడు.                                -  దిగంబర్ కామత్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే 


భారీ షాక్


గోవాలో ఇది కాంగ్రెస్​కు భారీ షాక్. మాజీ ముఖ్యమంత్రి సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు భాజపాలో బుధవారం చేరారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్​ కాషాయ కండువ కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. 



భారత్ జోడో అంటూ కాంగ్రెస్ యాత్ర ప్రారంభించింది. కానీ, గోవాలో 'కాంగ్రెస్ ఛోడో' కార్యక్రమం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడి భాజపాలో చేరుతున్నారు.                                            -   ప్రమోద్ సావంత్, గోవా సీఎం


అంతకుముందు ఎమ్మెల్యేలు సీఎం, అసెంబ్లీ స్పీకర్​తో సమావేశమయ్యారు. కాంగ్రెస్ శాసనపక్షాన్ని భాజపాలో విలీనం చేయాలని ఎమ్మెల్యేలు తీర్మానించారు. విపక్ష నేతగా ఉన్న మైఖెల్ లోబో ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. దీన్ని మాజీ సీఎం, ఎమ్మెల్యే దిగంభర్ కామత్ బలపర్చగా.. మిగతా ఎమ్మెల్యేలు ఆమోదించారు.


గోవాలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 40 స్థానాలకు గానూ భాజపా 20 సీట్లు దక్కించుకొంది. మెజార్టీ మార్కుకు ఒక్క సీటు తగ్గడంతో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదే ఎన్నికల్లో కాంగ్రెస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు వారిలో ఎనిమిది మంది భాజపాలో చేరిపోయారు.


Also Read: Lakhimpur Horror: లఖింపుర్ కేసులో షాకింగ్ విషయాలు- బాలికలపై గ్యాంగ్ రేప్, ఆపై హత్య!


Also Read: Gali Janardhan Reddy: గాలి జనార్ధన్ కేసులో సుప్రీంకోర్టు ఫైర్, ‘ఇది న్యాయాన్ని అవహేళన చేయ్యడమే’

Published at: 15 Sep 2022 11:52 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.