గాలి జనార్ధన్ రెడ్డికి సంబంధించిన గనుల అక్రమ తవ్వకాల కేసు విషయంలో సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బళ్లారికి చెందిన గాలి జనార్దన్ రెడ్డిపై సీబీఐ నమోదు చేసిన కేసులో 12 సంవత్సరాలు గడుస్తున్నా, ఇంకా విచారణ జరగకపోవడం ఏంటని బుధవారం సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇది సరైన పద్ధతి కాదని, న్యాయాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని అభిప్రాయపడింది.
గాలి జనార్ధన్ రెడ్డి కేసులో తీవ్రమైన అభియోగాలు ఉండగా, సదరు కేసులో 12 ఏళ్ల తర్వాత కూడా విచారణ సాగకపోవడం చాలా దురదృష్టకరమని న్యాయమూర్తులు అన్నారు. 2021 లో ఆగస్టు 19న ఇదే సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో విచారణ వేగవంతం చేయాలని ఆదేశించిందని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారని గుర్తు చేశారు. విచారణలో ఎలాంటి పురోగతి లేకపోవడాన్ని తీవ్రంగా పరిగిణిస్తున్నామని వారు అన్నారు.
2011లో గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టు
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఓబుళాపురం గనుల ఆక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్ధన్ రెడ్డితో పాటు మరో తొమ్మిది మందిపై సీబీఐ 2009లో కేసు నమోదు పెట్టింది. దాని ప్రకారం ఈ కేసులో 2011, సెప్టెంబరు 5న జనార్దన్ రెడ్డి అరెస్టు అయ్యారు. సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత 2015 జనవరి 20న సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే, కర్ణాటకలోని బళ్లారి, ఏపీలోని కడప, అనంతపురం జిల్లాలకు వెళ్లవద్దనే షరతులను కోర్టు విధించింది.
కోర్టు ఆదేశాలు తాను పాటిస్తున్నానని, కాబట్టి, తనపై ఉన్న బెయిల్ కండీషన్స్ మార్పు చేయాలంటూ ఆయన 2020లో సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ విచారణ సందర్భంగా కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేదని కోర్టు అప్పుడే తీవ్ర అసహనాన్ని ప్రదర్శించింది. మరోవైపు, ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. బళ్లారి ఆయన స్వస్థలమని, అక్కడ ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని, వారి ప్రాణాలకు ముప్పు ఉందని సీబీఐ వివరించింది. ఇందుకు స్పందించిన జస్టిస్ ఎం.ఆర్ షా సీబీఐ కేసు విచారణ ఏ దశలో ఉందని సీబీఐ తరపు లాయర్ ను ప్రశ్నించారు. దీంతో విచారణ సాగడం లేదని సీబీఐ తరపు అడిషనల్ సొలిసిటర్ జనరల్ చెప్పారు. అయితే, విచారణపై ఏమైనా స్టే ఉందా? అని న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా ప్రశ్నించారు.
గతంలో ఎప్పుడూ ఈ కేసు విచారణ విషయంలో స్టే అయితే లేదని, ఇప్పుడేమైనా స్టే ఇచ్చారా? అని ప్రశ్నించారు. అయితే, గతంలో లేదని అడిషనల్ సొలిసిటర్ జనరల్ చెప్పారు. మరి ప్రస్తుతం స్టే ఉందా? అని ప్రశ్నించగా, ఇప్పుడు కూడా స్టే లేదని సమాధానం ఇచ్చారు. దీంతో ధర్మాసనం సీబీఐ అధికారులు నుంచి వివరాలు తెలుసుకోవాలని ఆయనకు సూచించింది. విచారణ ఏ దశలో ఉంది, ఏ కారణాల వల్ల విచారణను ఇంతలా లేట్ చేస్తున్నారో తెలుసుకోవాలని కోరింది.
ఈ అంశంపై తమకు ఈ నెల 19వ తేదీలోపు సీల్డ్ కవర్‌లో నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. ఈ మేరకు హైదరాబాద్ సీబీఐ కేసుల కోర్టు ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జిని ఆదేశించింది. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌కు పిటిషనర్ రిజాయిండర్ దాఖలు చేయొచ్చని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.