Lakhimpur Kheri Case: 'వెన్నులో వణుకు పుట్టిస్తాం'- గ్యాంగ్ రేప్‌పై యోగి సర్కార్ సీరియస్

ABP Desam   |  Murali Krishna   |  15 Sep 2022 04:30 PM (IST)

Lakhimpur Kheri Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపుర్ హత్యాచార ఘటనపై యోగి సర్కార్ తీవ్రంగా స్పందించింది.

(Image Source: PTI)

Lakhimpur Kheri Case: సంచలనం సృష్టించిన లఖింపుర్ ఖేరి హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రేగుతున్నాయి. నిందితులను ఇప్పటికిప్పుడే ఎన్‌కౌంటర్ చేయాలని లేదా ఉరి తీయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సీరియస్‌గా స్పందించింది. 

ఉత్తర్‌ప్రదేశ్‌ అక్కాచెల్లెల హత్యాచార ఘటనలో దర్యాప్తు శరవేగంగా సాగుతోందని ఉత్తర్‌ప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్‌ పాఠక్‌ అన్నారు. 

జునైద్, సోహైల్, హఫీజుల్, కరీముద్దీన్, ఆరిఫ్‌లు ఈ దురాగతానికి పాల్పడ్డారు. బాలికలను గొంతునులిమి చంపి, ఆపై ఉరి తీశారు. ఈ ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ చేపడుతుంది. రాబోయే తరాలు సైతం వణికిపోయే విధంగా ఈ కేసులో దోషులను శిక్షిస్తాం. బాధితులకు న్యాయం చేస్తాం.                            - బ్రజేష్ పాఠక్, యూపీ డిప్యూటీ సీఎం 

ఇదీ జరిగింది

లఖింపుర్ ఖేరి జిల్లాలోని నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటికి కిలోమీటరు దూరంలో ఉన్న చెరుకు తోటలో ఇద్దరు దళిత అక్కాచెల్లెళ్లు చెట్టుకు ఉరివేసుకుని కనిపించారు.

అయితే వారిని హత్య చేశారని ఆ బాలికల తల్లి ఆరోపించింది. నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొరుగు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు వారిని అపహరించి హత్యాచారం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు.

షాకింగ్ విషయాలు

అయితే బాలికలను గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఆరుగురిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302, 376, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేసినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొంది.

" వివిధ మార్గాల్లో నేరాలకు పాల్పడిన మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేశాం. నిందితులను చోటూ, జునైద్, సోహైల్, హఫీజుల్, కరీముద్దీన్, ఆరిఫ్‌లుగా గుర్తించాం. నిందితుడు జునైద్‌ను ఎన్‌కౌంటర్‌లో పట్టుకున్నారు. దీంతో అతని కాలికి గాయమైంది.                                "

 

-సంజీవ్ సుమన్, లఖింపుర్ ఖేరి ఎస్‌పీ

నిందితులు.. మృతి చెందిన బాలికలకు స్నేహితులని ఎస్‌పీ వెల్లడించారు.

" నిన్న బాలికలను పొలాలకు రప్పించి సోహైల్, జునైద్‌లు అత్యాచారం చేశారు. బాలికలు నిందితులను పెళ్లి చేసుకోమని బలవంతం చేయడంతో సోహైల్, హఫీజుల్, జునైద్ గొంతునులిమి చంపారు. ఆ తర్వాత వారు కరీముద్దీన్, ఆరిఫ్‌లను పిలిచి బాలికలను చెట్టుకు ఉరితీశారు. "

Published at: 15 Sep 2022 03:34 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.