AP Assembly BAC :   ఏపీ అసెంబ్లీ సమావేశాలు  ఐదు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ మేరకు బిజినెస్ అడ్వయిజరీ కమిటీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 21 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. టీడీపీ  ప్రతిపాదించిన అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. స్పీకర్‌ తమ్మినేని సీతారాం  అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి సీఎం జగన్‌ , మంత్రులు, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు  హాజరయ్యారు. సభ్యులు లేవనెత్తే అన్ని విషయాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ఛీఫ్ విప్ ప్రసాదరాజు ప్రకటించారు.   19 అంశాలను చర్చించేందుకు  టీడీపీ ప్రతిపాదించిందని...  27 అంశాలపై చర్చించాలని వైసీపీ ప్రతిపాదన చేసిందని తెలిపారు. ప్రతిపక్షం ఇచ్చిన ఏం అంశంపై చర్చించేందుకైనా ప్రభుత్వం సిద్ధమని స్పష్టం చేశారు.  


కుటుంబసభ్యులను విమర్శించుకోవడం ఆపాలన్న సీఎం జగన్ 


బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ , టీడీపీ నేత అచ్చెన్నాయుడు మధ్య కీలకమైన చర్చ జరిగినట్లుగా సమాచారం. ఇటీవల రాష్ట్రంలో రెండు పార్టీల నేతల దూషణలకు పాల్పడుతున్నారు. ఈ అంశాన్ని జగన్ ముందుగా ప్రస్తావించినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మనం మనం రాజకీయ నాయకులం ఎన్నైనా అనుకుంటాం.. కానీ కుటుంబసభ్యులను ఈ రాజకీయ విమర్శల్లోకి లాగడం ఎందుకని జగన్ అచ్చెన్నాయుడును ప్రశ్నించారు. కుటుంబ సభ్యుల జోలికి రావాలనుకోం. కుటుంబ సభ్యుల జోలికి మీరొస్తే మా ముఖ్యమంత్రిని అంటారా అని మావాళ్లూ అంటారు. మీరు మానేస్తే మావాళ్లూ ఆటోమెటిక్‌గా మానేస్తారు’ అని అచ్చెన్నాయుకుడు చెప్పినట్లుగా తెలుస్తోంది. 


అన్ని అంశాలపై చర్చిద్దామన్న అధికార పక్షం 


‘మీరు ఏమీ అనకుంటే మా వాళ్లు అనరు. మీరంటే మాత్రం మావాళ్లూ అంటారు’ అంటారని జగన్ అన్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో బీఎసీ సమావేశంలో ఉన్న మంత్రులు జోగి రమేష్ , బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు కూడా తమ  సీఎంను అంటే ఊరుకునేది లేదని అన్నట్లగా తెలుస్తోంది.  ‘మీ ప్రశ్నలూ మేం లేవనెత్తబోయేవీ దాదాపు ఒక్కటే అన్నీ చర్చిద్దాం’ అని అచ్చెన్నాయుడుకు సీఎం జగన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. 


ఢిల్లీ లిక్కర్ స్కాంలో భారతిపై టీడీపీ నేతల ఆరోపణలు - రివర్స్‌లో చంద్రబాబు భార్యపై వైసీపీ నేతల తిట్లు 


ఢిల్లీలో లిక్కర్ స్కాం వెలుగులోకి రావడంతో పాటు అక్కడ స్కాంలో విజయసాయిరెడ్డి బంధువుల కంపెనీ అయిన అరబిందో గ్రూప్ పేరు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది.  ఈ అరబిందో గ్రూప్ సాక్షి మీడియాలో పెట్టుబడులు పెట్టాయని.. ఈ కారణంగా ఢిల్లీ లిక్కర్ స్కాంతో  జగన్ సతీమణి భారతికి సంబంధం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలు  కూడా ఢిల్లీ లిక్కర్ స్కాంతో వైఎస్ఆర్‌సీపీ నేతలకు సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ఆయన కుటుంబంపై కొడాలి నానితో పాటు ఇతర నేతలు అసభ్య పదజాలంతో విరుచుకుపడటంతో.. రెండు పార్టీల నేతల కుటుంబసభ్యులను విమర్శించుకుంటున్నారు. దీనికి పులిస్టాప్ పెట్టాలన్న చర్చ బీఏసీలో జరిగింది.