Sanju Samson Fans To Protest Against BCCI: టీమ్‌ఇండియా క్రికెటర్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson) అభిమానులు బీసీసీఐపై గుర్రుగా ఉన్నారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు అతడిని ఎంపిక చేయకపోవడమే ఇందుకు కారణం. అందుకే బోర్డుపై ఆక్రోశం వెల్లగక్కేందుకు వారు సిద్ధమవుతున్నారు. తిరువనంతపురంలో భారత్‌, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచు జరిగేటప్పుడు భారీ నిరసనలు ప్లాన్‌ చేస్తున్నారని తెలిసింది. ఈ మేరకు ఐఏఎన్‌ఎస్‌ ఓ కథనం పబ్లిష్‌ చేసింది.


ఈ ఏడాది ఐపీఎల్‌లో సంజూ శాంసన్‌ అదరగొట్టాడు. తన కెప్టెన్సీ నైపుణ్యంతో జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. రన్నరప్‌గా నిలిపాడు. 17 మ్యాచుల్లో 28 సగటు, 146 స్ట్రైక్‌రేట్‌తో 458 పరుగులు చేశాడు. టీమ్‌ఇండియా తరఫున 2022లో 6 వన్డేలు, 6 టీ20లు ఆడాడు. వెస్టిండీస్‌, జింబాబ్వే పర్యటనల్లో అందరినీ ఆకట్టుకున్నాడు. అయినప్పటికీ ఆసియాకప్‌లో అతడికి చోటివ్వలేదు. ఇక ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ తుది 15 మందిలో తీసుకోలేదు. కనీసం రిజర్వుగా అయినా ఎంపిక చేయలేదు.


ఇవన్నీ పక్కన పెడితే ఏ మాత్రం ఆకట్టుకోని రిషభ్ పంత్‌ను తీసుకోవడం సంజూ అభిమానులకు నచ్చలేదు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ జట్టును ప్రకటించనప్పటి నుంచి అతడికి మద్దతుగా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు, సోషల్‌ మీడియాలో ప్రతి రోజు ఈ అంశాన్ని ట్రెండింగ్‌లో ఉంచుతున్నారు. సునిల్‌ గావస్కర్‌, రవిశాస్త్రి సహా మరికొందరు మాజీలు అతడిని తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిందని పేర్కొన్నారు. ఆసీస్‌ బౌన్సీ పిచ్‌లు అతడి బ్యాటింగ్‌ శైలికి నప్పుతాయని అన్నారు. అయినప్పటికీ సెలక్టర్ల నుంచి స్పందన లేకపోవడంతో ఫ్యాన్స్‌ నిరసనలు తెలపాలని ప్లాన్‌ చేస్తున్నారు.


అతి త్వరలోనే దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో పర్యటించనుంది. మూడు టీ20ల్లో ఒకటి తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో తమ ఆగ్రహాన్ని బీసీసీఐకి చూపించాలని సంజూ శాంసన్‌ ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. బోర్డుకు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టాలని భావిస్తున్నారు. సంజూ చిత్రంలో కూడిన టీషర్టులు ధరించి ఆందోళన చేపడతారని తెలిసింది. మొత్తంగా ఇది దేనికి దారి తీస్తుందో చూడాలి.


టీ20 వరల్డ్‌కప్‌కు భారత జట్టు


రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్


స్టాండ్ బై ప్లేయర్లు


మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్


అక్టోబర్ 16వ తేదీ నుంచి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. టీమిండియా తమ మొదటి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. అక్టోబర్ 23వ తేదీన ఈ మ్యాచ్ జరగనుంది. భారత జట్టు నేరుగా సూపర్-12 మ్యాచ్ ఆడనుంది.


మొదట ఎనిమిది జట్లు క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. వీటిలో శ్రీలంక, వెస్టిండీస్, నమీబియా, యూఏఈ, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, జింబాబ్వే, ఐర్లాండ్ జట్లు తలపడనున్నాయి. వీటిలో నాలుగు జట్లు సూపర్-12కు అర్హత సాధిస్తాయి.