ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుమారుడు శ్రీసింహ.. 'యమదొంగ' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయమై.. 'మత్తువదలరా' సినిమాతో హీరోగా మారారు. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకొని తన టాలెంట్ నిరూపించుకున్నారు. ఆ తరువాత నటించిన 'తెల్లవారితే గురువారం' సినిమా ఏవరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇప్పుడు ఈ హీరో 'దొంగలున్నారు జాగ్రత్త' అనే మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.


ప్రముఖ నిర్మాత సురేష్ ప్రొడక్షన్, గురు ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో సతీష్ త్రిపుర అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.


ఆగి ఉన్న కారులో దొంగతనం చేయడానికి వెళ్తాడు హీరో. తన ట్రిక్ ప్లే చేసి కారు డోర్ ఓపెన్ చేస్తాడు. తనకు కావాల్సిన వస్తువులు తీసుకొని వెళ్లిపోదామనుకుంటే కారు డోర్ లాక్ అయిపోతుంది. ఎంత ప్రయత్నించినా రాదు. తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి సహాయం కోరుతాడు. కానీ అతడు మాత్రం ఎంతసేపటికీ రాడు. అదే కారులో బాంబ్ ఉందని తెలుసుకుంటాడు హీరో. ఆ తరువాత ఏం జరిగిందనేది సినిమా. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి సినిమా కూడా ప్రామిసింగ్ గా ఉంటుందేమో చూడాలి. 


ఈ సినిమాలో తమిళనటుడు సముద్రఖని కీలకపాత్ర పోషిస్తున్నారు. కాల భైరవ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తుండగా.. యశ్వంత్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఇక కీరవాణి తన సినిమా పనుల్లో ఎంత బిజీగా ఉన్నా.. తన కుమారుడి సినిమా కథల ఎంపిక విషయంలో కొన్ని సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా ఆయన ఓకే చేసిందేనట. 


Also Read : మా సినిమాను 'బాహుబలి', 'పొన్నియన్ సెల్వన్'తో కంపేర్ చేయడం లేదు!


Also Read : బీజేపీ మద్దతుదారులు నన్ను ఎందుకు ద్వేషిస్తారు? - రష్మీ గౌతమ్